17.10.11

పేదవాడి ప్రాణం



ద్ది సంవత్సరాల క్రితం నాటి మాట. మా పురోహితుడువాళ్ళన్నగారు ఒక కొత్త శాంట్రో కారు కొన్నాడు. ఆయనా పూజారే లెండి, స్థానిక శివాలయంలో ! నాలుగు చక్రాల వాహనాలు మా పురోహితుడికైతే కొత్త కాదు. పూర్వాశ్రమంలో ఆయనకి ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ఉండేది. వాహనచోదకుల్ని నియోగించడమే కాకుండా జాతీయ రహదార్ల మీద తన వాహనాల్ని తానే స్వయంగా డ్రైవ్ చేసేవాడు. ఒకేడాది తీవ్రమైన నష్టాలు చవిచూడ్డంతో ఆ కార్లూ, వ్యాన్లూ మొత్తం అమ్మేసి, పాతబాకీలన్నీ తీర్చాడనిపించుకొని బయటపడి తల తడిమి చూసుకున్నాడు. అనంతరం చిన్నప్పుడు నేర్చుకున్న వేదం ముక్కల్ని సాకల్యంగా నెమరేసుకొని, ' బతుకు జీవుడా !' అనుకుంటూ పౌరోహిత్యంలోకి దిగాడు. అయినా ఇప్పటికీ పాతవాసనలు వదలక, ఎక్కడైనా కొత్తకార్లు కనిపిస్తే ఆగిపోయి, వాటిని చూస్తూ ఏదో ధ్యానముద్రా పారవశ్యంలోకి వెళ్ళిపోతాడు. వేఱే జిల్లాల్లో పౌరోహిత్యం పని  తగిలిందంటే ట్రెయిన్ కోసమో, బస్సుకోసమో ఎదురుచూడడు. ఒక బైకు తీసుకోవడం, పగలూ, అర్ధరాత్రీ, అపరాత్రీ అని చూడకుండా రఁయ్యిమని దూసుకుపోవడం, అంతే. 

సరే ! అదలా ఉంచి, కొత్తకారు కొన్నాక దాంట్లో స్వగ్రామానికి (గుంటూరుజిల్లా) వెళ్ళొస్తే బాగుంటుందనే సంకల్పం కలిగింది అన్నదమ్ములకి. అనుకున్నట్లే వెళ్ళారు. సారథ్యం మా పురోహితుడుగారిదే. కానీ తిరుగుప్రయాణంలో నల్లగొండ జిల్లా కోదాడ దగ్గఱికొచ్చేసరికి బాగా చీకటిపడింది. వీథిదీపాలు లేవో, ఉన్నా మసక జాస్తీగా ఉందో, లేకపోతే... అనుకోకూడదు గానీ మా పురోహితుడికే ఏమైనా నిద్రతూగిందో, మత్తు జోగిందో ఏమైందో గానీ మఱి మొత్తమ్మీద ముందు వెళుతున్న ఒక సైకిలుకి వీళ్ళ బండి బలంగా తగిలింది. దానిమీదున్న పదిహేనేళ్ళ అబ్బాయి దభాల్న ఎగ్గిరి అవతల పడ్డాడు. మా పురోహితుడు ఇహలోకంలోకి వచ్చి, సడన్ బ్రేకేసి ఆగాడు. అప్పటికే జఱగాల్సింది జఱిగిపోయింది. ఆ ఎగిరిపడడంలో ఆ అబ్బాయి తలకి ఏదో పెద్దఱాయి గట్టిగా తగిలి అతను అక్కడికక్కడే చనిపోయాడు, ఆస్పత్రికి మోసుకెళ్లేంత వ్యవధానం కూడా లేని విధంగా ! అంటే, అనుకోకుండా అర్చకుడు కాస్తా క్షణాల మీద హంతకుడైపోయాడన్నమాట.

తరువాతి కథ షరా మామూలే. జనం మూగారు. కాసేపయ్యాక వార్త అందుకుని ఆ అబ్బాయివాళ్ళ మేనమామా, మేనత్తా పరిగెత్తుకొచ్చారు గుండెలవిసిపోయేలా శోకాలు పెడుతూ ! ఆ అబ్బాయికి అమ్మానాన్నా లేరట. మేనమామ దగ్గఱే పెఱుగుతున్నాడట. వాడుక చొప్పున సాయంకాలం ట్యూషన్‌కెళ్ళి తిరిగొస్తూంటే ఈ ఘోరం జఱిగింది. జనం బ్రాహ్మల్ని కొట్టడానికి సిద్ధమవుతూంటే ఆపద్బాంధవుడిలా ఊడిపడ్డాడు ఆ ఊరి ఎస్సై. జనాన్ని  చెల్లాచెదఱు చేసి, అబ్బాయి శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, ఘటనాస్థలానికీ, కారుకీ ఛాయాచిత్రాలు తీయించాడు. అనంతరం కారువాలాలందఱినీ అరెస్టు చేసి, కారుతో సహా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. చనిపోయిన అబ్బాయివాళ్ళ మేనమామా, మేనత్తా కూడా వెంట వెళ్ళారు.

అక్కడికి చేఱుకున్నాక మొదలయ్యాయి బేరసారాలు. ఈ కేసు ఎంత పెద్దదో, న్యాయప్రకారం విచారిస్తే దీంట్లో ఎవఱెవఱికి ఎంత శిక్షపడే అవకాశం ఉందో, ఎంత నష్టాన్ని భరించాల్సి వస్తుందో ఎస్సైగారు ఓపిగ్గా ఆ అన్నదమ్ముల్ని కూర్చోబెట్టి వివరించారు. గతంలో తనకి తగిలిన ఇలాంటి కేసుల పూర్వాపరాలు కూడా వాళ్ళకి పరామర్శించి తెలిపారు. ఇహ "ఆ తరువాత మీ యిష్టం" అనేశారు. వాళ్ళకి మతిపోయినంత పనైంది. కాసేపు దిగాలుగా ఎస్సైగారి వంకా, మఱికాసేపు ఠాణా గోడల వంకా చూస్తూ శ్మశాననిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. 


ఇంతలో ఆ పిల్లవాడి మేనమామ, "ఎస్సైగారూ ! మావాడికి కాలం ఖర్మం తీఱి వాడలా పోయాడు. ఏం చెయ్యగలం ? పాపం ! ఈ పంతుళ్ళని జైల్లో పెట్టిస్తే మనకేమొస్తుంది ?" అన్నాడు ఏడుస్తూ.

"అవునవును, అంతేలెండి ! మనకేమొస్తుంది ? అయినా నేనసలు విషయం వాళ్ళతో చెప్పాలి గదా ! చెబుతున్నానంతే" అన్నాడు ఎస్సై. 

అని వాళ్ళవంక తిరిగి, "చూశారుగా ! పాపం, మీకు శిక్షపడడం ఆయనకి ఇష్టం లేదు. ఈ వయసులో ఆయనకి రాకూడని కష్టం వచ్చింది. ఇహ జీవితశేషమంతా ఎలా బతకాలి ఆయన ? ఆలోచించండి" అన్నాడు. వాళ్ళకి చెవుడేమీ లేదు. అంతా వింటూనే ఉన్నారు. వాళ్ళకి ఏమీ పాలుపోలేదు. 

అంతట్లో మళ్లీ ఎస్సైగారే, "పాపం, ఆ ముసలాయనకి నాలుగులక్షలిచ్చేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి. కేసూ గీసూ లేకుండా నే చూసుకుంటా గదా !" అన్నాడు.  ఆ అంకె విని బ్రాహ్మలు బిత్తరపోయారు.

"అయ్యబాబోయ్ ! నాలుగు లక్షలే ? నా వల్లకాదు. ఈ కారుకే అయింది నాకు నాలుగులక్షలు. మళ్లీ ఇంకో నాలుగా ?" అన్నాడు కాదు, అఱిచినంత పనిచేశాడు మా పురోహితుడి అన్నగారు. 

"మఱి ఎంతివ్వగలరో చెప్పండి ?" అడిగాడు ఎస్సై అసహనంగా మొహం పెట్టి.

పెద్దాయన ఉద్రేకంతో ఊగిపోతూ "ఏమీ ఇవ్వను, ఇవ్వలేను. నన్నూ, నా తమ్ముణ్ణీ జైలికి పంపించండి." అంటూంటే తమ్ముళ్ళంతా కలిసి అన్నగారిమీద పడి నోరుమూశారు. మూసి, ఎస్సైగారితో "అలా అంటే ఎలా సార్ ! దయచేసి మా పరిస్థితి కూడా కాస్త అర్థం చేసుకోండి. ఇది మేము కావాలని చేసిన యాక్సిడెంటు కాదు. ఆ రోడ్లో లైట్లు లేవు. పైపెచ్చు ఆ అబ్బాయి రోడ్డుమధ్యలోకొచ్చి నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మనుషుల్ని చంపడం మాకు వృత్తీ కాదు. సరదా అంతకంటే కాదు." అని ప్రాధేయపడ్డారు.

"నాకర్థమయింది పంతుళ్లూ ! కానీ కేసు కేసే కదా ?" అన్నాడు ఎస్సై చేతులెత్తేసి. అని ఆ పిల్లవాడి మేనమామ వంక తిరిగి "ఏమయ్యా ! వాళ్ళు నాలుగివ్వలేరంట. ఏం చేద్దాం ?" అని అడిగాడు. 

"కనీసం మూడున్నఱన్నా...." అంటూ నసిగాడు ముసలాడు.

"అది కూడా మాకెక్కువే గద సార్ !" అన్నాడు మా పురోహితుడు దిగాలుగా.

"అందుకే ఇందాక మీరు ఎంతివ్వగలరని అడిగితే మీ అన్నయ్యగారు ఏమీ ఇవ్వననేశాడు. దేనికైనా పట్టూ విడుపూ ఉండాలంటున్నాను. ఇవ్వకపోతే మీ యిష్టం. మాదేం లేదు. మా రొటీన్ వర్కు మేం చేసుకుంటాం. కేసూ...శిక్షా... గట్రా...మామూలే." 

"సార్ ! రెండున్నఱ దాకా అయితే...."

ఎస్సై ముసలాయన వంక తిరిగి, "ఏమయ్యా ! సరేనా ?" అనడిగితే, ముసలాయన తల పంకించాడు. 

అన్నదమ్ముల్లో ఒకఱు హైదరాబాదు వెళ్ళి డబ్బు తీసుకొచ్చేలా, ఆయనొచ్చేదాకా తతిమ్మావాళ్ళంతా కారుతో సహా స్టేషన్‌లోనే ఉండేలా ఒప్పందం కుదిరింది. ఆ రెండున్నఱా తీసుకెళ్ళడానికి మా పురోహితుడు హైదరాబాదొచ్చాడు. చాలా హడావిడి మీదున్నాడు. అడిగితే కారణం చెప్పలేదు. ఆ రోజున ఆయన చేతుల మీదుగా మా యింట్లో ప్రత్యేక పూజలున్నాయి. వేఱేచోట్ల అభిషేకాలున్నాయి. అవన్నీ గబగబా పూర్తిచేసుకొని, కావాల్సినది డ్రా చేసుకుని మళ్లీ ఆఘమేఘాల మీద కోదాడ వెళ్ళిపోయాడు. మర్నాటి ఉదయానికల్లా అన్నదమ్ములంతా నవ్వుతూ, తుళ్ళుతూ హైదరాబాదులో కారు దిగారు. 

ఆ తరువాత కేసా ? గీసా ? ఆ ఊసే లేదు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్