31.10.11

స్త్రీల సైన్యప్రవేశం



లా దేశాల సైన్యవిభాగాల్లో ఇప్పుడు స్త్రీలు పనిచేస్తున్నారు. 1972 నాటి అమెరికన్ సైన్యంలో 2 కంటే తక్కువగా ఉన్న స్త్రీల శాతం 1995 నాటికల్లా సుమారు 13 శాతానికి పెఱిగింది. ప్రస్తుతం అమెరికన్ పదాతిదళాల్లో 68 వేలూ, నౌకాదళంలో 56 వేలూ, వైమానిక దళంలో 8 వేలూ స్త్రీలున్నారు. హంగరీలోనైతే 25 శాతం మంది స్త్రీలే. ఆస్ట్రేలియాలో 13 - 15 శాతాల మధ్య ఉంటారు.

అక్టోబర్ విప్లవానికంటే ముందే రష్యాసైన్యంలో రెండువేలమంది స్త్రీలని చేర్చుకున్నారు. కానీ అప్పట్లో జర్మనీతో జఱిగిన యుద్ధంలో ఆ స్త్రీసైనికులు 90 శాతం మంది చనిపోవడంతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా నిలుపు చేశారు. ఐనప్పటికీ రెండో ప్రపంచయుద్ధంలో రష్యన్ స్త్రీసైనికుల పాత్ర భారీ స్థాయికి చేఱుకుంది. దీనికొక కారణం - యుద్ధానికి పంపదగ్గ మగవాళ్ళే దేశంలో లేకపోవడం, అప్పటి రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్ సుమారు కోటిమంది రష్యా యువకుల్ని కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకులనే కారణం చేత అంతకుముందే హత్య చేయించడం. చివఱికి రష్యాలోకి చొఱబడ్డ జర్మన్లు రష్యా సైన్యం చేతుల్లో కాదు గానీ భీకరమైన రష్యన్ చలి (Russian winter) కి తట్టుకోలేక చనిపోయారు. అది తమ ఘనతేనని స్టాలిన్  ప్రకటించుకొని ఆ స్త్రీలొక్కొక్కఱికీ Hero of the Soviet Union పురస్కారాలు ప్రదానం చేశాడు. అయితే జర్మన్ సైన్యం వెనుదిరగడానికి అసలు కారణమేంటో తనకి తెలుసు గనక ఆ స్త్రీలెవ్వఱికీ పదోన్నతులివ్వలేదు. అయితే ఇప్పుడు కూడా రష్యా సైన్యంలో 10 శాతం మంది స్త్రీలే ఉన్నారు.        

మన దేశంలో కూడా పోరాటేతర విభాగాల (non-combatant divisions) లో స్త్రీలు చాలాకాలంగా పని చేస్తున్నారు. దరిమిలా వైమానిక, నావిక దళాల్లో కూడా వారిని ప్రవేశం కలిగించడం జఱిగింది. ఈమధ్య కొత్తగా పోరాట (combatant) విభాగాల్లో కూడా వారిని తీసుకోవాలని రక్షణశాఖ నిర్ణయించింది. ప్రస్తుత పాలక పక్షానికి ఒక స్త్రీ నాయకత్వం వహిస్తూండడం వల్ల ఇలాంటి ప్రతిపాదనలు త్వరగా కార్యరూపం దాలుస్తున్నాయని నా అభిప్రాయం.

అయితే ఇలాంటి ప్రతిపాదనల్ని నేను హర్షించను. ఎందుకంటే వీటి వెనక దూరదృష్టీ, లోతూ కొఱవడ్డాయి. ఈ చర్యల వెనక అజ్ఞానమూ, అవగాహనారాహిత్యమూ, తొందఱపాటూ దాగున్నాయి. స్త్రీలు కూడా పురుషులతో సమానమనీ, పురుషులు చేసే ఏ పనైనా స్త్రీలు కూడా చేయగలరనీ నిరూపించడానికి, అలా అడుగడుగునా ఒక lib statement ఇవ్వడానికీ ఫెమినిస్టులు తెగ ఉబలాటపడిపోతూంటారు. ఇలాంటివారందఱికీ పాశ్చాత్యురాలైన సోనియా నాయకత్వం ఒక ఆయాచిత వరంలా, లంకెబిందెలా దొఱికింది. తమ చిరకాల వాంఛితాలన్నింటినీ ఆ అధిష్ఠానదేవతకి మొఱపెట్టుకొని ఆధికారికంగా తీర్చుకుంటున్నారు. పురుషుల సమర్థతకి మాదిరే స్త్రీల సమర్థతకి సైతం సర్వేసర్వత్రా ప్రశ్నాతీతమైన సామాజిక ఆమోదం (unquestionable social acceptance) కావాలని వారు తహతహలాడుతున్నారు.

స్త్రీల తెలివితేటల గుఱించి, లేదా సమర్థత గుఱించి ఇప్పుడు అత్యవసరంగా, ఆదరా బాదరా ఎవఱికి నిరూపించి చూపాలో నాకు తెలీదు. మొత్తమ్మీద వారికి ఏమీ చేతకాదంటున్న రోజులైతే కావివి. స్త్రీలు చాలావఱకు అన్నీ చేయగలరు కానీ పురుషుల సహకారంతోనే, వారి రక్షణలోనే, శిక్షణలోనే చేయగలరు. స్త్రీకీ, పురుషుడికీ మధ్య ఉన్న తేడా ప్రధానంగా మనోవైఖరి (attitude) కీ, అంతిమ ఫలితాలకీ సంబంధించినటివంటిది. కొన్ని వైఖరులు పురుషులకే ప్రత్యేకం. అలాగే కొన్నికొన్ని స్త్రీలకే ప్రత్యేకం. దేవుడివ్వనిదానికి మనిషి మరామత్తు చేయలేడు. అందుకు మనిషిని నిందించడం సబబు కాదు.

అయితే స్త్రీల సైన్యప్రవేశానికి నేను అభ్యంతరం చెప్పడానికి అసలుకారణం ఇది కాదు. "స్త్రీలు సైనికోద్యోగాలకి పనికొస్తారా ? లేదా ?" అనే మౌలికాంశ చర్చ నేను చేయబోవడం లేదు. వాటికి దరఖాస్తు చేసేవారు చేస్తారు. తీసుకునేవారు తీసుకుంటారు. మధ్యలో మనకెందుకు వాదం ? కానీ "ఈ చర్య మేలు చేస్తుందా ? కీడు చేస్తుందా ?" అనే మూల్యాంకన చర్చ చేయక తప్పదు. సైనికోద్యోగంలో సుఖం లేదు. మనశ్శాంతి కూడా లేదు. సాధారణ పరిస్థితుల్లో మగవాళ్ళే అది అభిమతించరు. కానీ "ఆ బాధలేవో మేం పడతాం, మాకివ్వండి సైనికోద్యోగం" అంటూ ఎవఱైనా స్త్రీలు ముందుకొస్తే "సరేనమ్మా ! తీసుకోండి" అని చెప్పి మగవాళ్ళు ఆనందంగా బతికిపోవచ్చు. ఆడైనా, మగైనా తాము పనికొస్తామని తమకి తాము సంతృప్తి చెందితేనే ఆ ఉద్యోగాలకి దరఖాస్తు చేయబూనుకుంటారు. ఆ ఆత్మవిశ్వాసం లేనివారు చేయరు. కాబట్టి Right people in right positions అనే సూత్రం అమల్లో ఉన్నంత వఱకూ మనకి ఏ బాధా లేదు. నా అభ్యంతరాలకి కారణం అది కాదు. స్త్రీలకి ప్రవేశం లేని సంస్థలూ, విభాగాలూ చాలా ప్రశాంతంగా, పనిచేసుకోవడానికి వీలుగా ఉంటాయి. స్త్రీలు లేనంతకాలమూ ఆ వ్యవస్థలు ఏ సాముదాయిక లక్ష్యాల కోసం ఏర్పఱచబడ్డాయో అవి సమీచీనంగా నెఱవేఱతాయి. ఇలా అంటున్నందుకు నాకు స్త్రీద్వేషి అని బిరుదివ్వకండి. వాస్తవం చెబుతున్నానంతే. ఎందుకంటే ఇది పూర్తిగా స్త్రీల వల్ల కాదు గానీ వారిని పురుషులు ఉపయోగించుకునే పద్ధతుల వల్ల కూడా జఱుగుతుంది. కానీ అలా ఉపయోగించుకో బడడానికి గణనీయశాతం స్త్రీలు సర్వకాల సర్వావస్థల్లోనూ సిద్ధంగా ఉండడమే మన సమస్య.

ఇంకొన్ని లోపాలు కూడా లేకపోలేదు. స్త్రీలు ఎక్కడ ప్రవేశిస్తే అక్కడల్లా తమకంటూ విశిష్ట/ పక్షపాత మన్నింపు (preferential treatment) కోరుకుంటారు. తాను మగవాడి కంటే అంతర్గతంగా చాలా Better being ని అని ప్రతి స్త్రీ భావించుకుంటూండడం, ఈ భావం వారికి సామూహికంగా నరనరాలా జీర్ణించిపోవడం దీనిక్కారణం. చిన్నప్పట్నుంచీ తమ కళ్ళముందు మగపిల్లల్ని మాత్రమే చావగొట్టడం, తమ జోలికి ఎవఱూ రాకపోవడం చూసిన ఆడపిల్లల్లో "తాము చాలా స్పెషల్" అనే భావన అభివృద్ధి చెందుతుంది. పెద్దయ్యాక కూడా ఆ భావనే వారి చుట్టుచూపునీ, లోకావలోకననీ తీర్చిదిద్దుతుంది. ఈ Female superiority complex, లేదా స్త్రీ-అహం మూలాన, పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణలో మాత్రం వారు ఏ విధమైన సమానత్వాన్నీ వర్కౌట్ కానివ్వరు. స్త్రీపురుషులు కలిసి పనిచేసేచోట సమానత్వాన్ని ఖచ్చితంగా అమలు జఱిపేటప్పుడు కొన్నిసార్లు ఏదో ఒక పక్షంవారు నష్టపోయే అవకాశం ఉంటుంది. దైవికంగా ఈ నష్టపోయే వర్గంలో తాను ఉండాల్సివస్తే స్త్రీ ఆ వాస్తవాన్ని జీర్ణించుకోజాలదు. భరించజాలదు. తాను స్త్రీ కావడం వల్లనే మగవారంతా ఏకమై తనని నష్టపఱుస్తున్నారని సెక్సిజమ్ ఆరోపణలు చేస్తూ వీథికెక్కుతుంది. ఫెమినిస్టులంతా కలిసి ఆమెకి వత్తాసు పలుకుతూ గడబిడ సృష్టిస్తారు. గతంలో చాలాసార్లు ఇలా జఱిగింది. అందుకే ఉద్యోగాలిచ్చేవారు "ఈ గొడవ మనకెందుకులే ?" అని చెప్పి మగవాళ్లనే బలిచేసి యథామామూలుగా ఆడవాళ్ళని సుఖపెడుతూంటారు. 

ఉదాహరణకి మొన్న హైదరాబాదులో జఱిగిన బందునాడు పలు సార్థవాహాలవారు ఆడ ఉద్యోగులకి సెలవు ప్రకటించి మగ ఉద్యోగుల్ని మాత్రం విధులకి హాజరు కమ్మన్నారు. ఒకే కంపెనీలో ఒకే పని చేస్తూ ఒకే జీతం తీసుకునేవాళ్ళల్లో కొందఱికి ఒక న్యాయం , మఱికొందఱికి ఇంకో న్యాయం వర్తింపజేయడం సమంజసమా ? మఱి ఆడవాళ్ళ సేవలు అంత అత్యవసరం కానప్పుడు, వారు లేకపోయినా సార్థవాహాలు యథాప్రకారం నడుస్తాయన్నప్పుడు, మగవారి సేవలు మాత్రమే బాహ్యసమాజానికి అత్యావశ్యకాలైనప్పుడు అసలు ఆడవారికి ఉద్యోగాలివ్వడం దేనికి ? భవిష్యత్తులో సైన్యం పరిస్థితి ఈ తెఱగు వివాదాలకి అతీతంగా ఉంటుందనుకోను. సమానత్వం పేరుతో అన్నింటిలోకీ ప్రవేశం పొందే ఆడవారు అలా ప్రవేశం పొందాక అన్ని సమానత్వ సూత్రాలకీ తిలోదకాలిచ్చి తమకి ప్రత్యేక హక్కులూ, సౌకర్యాలూ, రక్షణలూ కావాలని నిలదీయడమే ఇందులో మతలబు. మళ్లీ ఈ బాధ్యతారాహిత్యానికి జెండర్ సిన్సిటివిటీ అని పేరు కూడా పెట్టుకొని సిగ్గులేకుండా ఊరేగుతున్నారు ఫెమినిస్టులు. జెండర్ అంటే కేవలం ఆడతనమేనా ?

సైన్యంలో చేఱడమంటే ఏదో యూనిఫామ్ వేసుకోవడం, రైఫిల్ పట్టుకోవడం ఒక్కటే కాదు. హింసించడానికీ, హింసలు పడడానికీ సిద్ధం కావడమే. ఆయుధధారులు స్త్రీలైనా, పురుషులైనా శత్రువులైన విదేశీయులు కనికరించరు. దొఱక్కపోతే కాల్చి చంపుతారు. దొఱికితే అత్యాచారాలకి పాల్పడతారు. కాబట్టి ఆడవారు పోరాటదళాల్లో చేఱినా, వారిని ప్రథమావకాశంలోనే పోరాటానికి పంపరు. ముందు మగసైనికుల్నే పంపుతారు, అంటే మళ్ళీ అక్కడ ఆడవాళ్ళని సాధ్యమైనంతగా సుఖపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారని ఊహించవచ్చు. కానీ ఒకవేళ అలా పంపినప్పుడు అక్కడ విదేశీ పురుషసైనికుడి తుపాకీ తూటాల వర్షంతో ఒక ఆడ సైనికురాలు నేలకొఱిగి చనిపోయే ముందు తనని కాల్చిన సైనికుణ్ణి చూడగలిగితే "మగవాడివయ్యుండీ నాలాంటి ఆడదాన్ని ఇలా నిస్సహాయంగా కాల్చిచంపుతున్నావ్" అని మౌనంగా ఆక్రోశిస్తూనే చనిపోతుంది.

యుద్ధాలూ గట్రా లేనప్పుడు సైనికురాళ్ళని స్వదేశీ సైనికులే వాడుకుంటున్నారంటూ దేశాదేశాలవారు ఆరోపిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ ఆరోపణల్లో నిజమున్నా, లేకపోయినా అందులో తప్పు పూర్తిగా మగసైనికులదేనని ఆరోపించడం సౌకర్యవంతం కావచ్చునేమో కానీ వాస్తవం కాకపోవచ్చు. ఏదేమైనా స్త్రీలు మగజాతిపనుల మధ్య ఒక గొప్ప ఏకాగ్రతాభంగం (disturbance) అని చెప్పక తప్పదు. మగజాతి చచ్చీ చెడీ సహస్రాబ్దాల తరబడి చెమటోడ్చి నిర్మించిన మగవ్యవస్థల్లోకి, ఆడవాళ్ళని రిజర్వేషన్ల లాంటి అడ్డమైన దొడ్డిదార్లలో బలవంతంగా లాక్కురావడం, అక్కడ వాళ్ళు సమస్యలెదుర్కోవడం, ఆడవాళ్ళ పుట్టుబలహీనతలకి మగవాళ్ళని శిక్షించడం, అందుకోసం ప్రత్యేకంగా మళ్లీ ఆడచట్టాలు, ఆడకోర్టులూ, ఆడగూఢచారులూ, ఆడన్యాయవాదులూ, ఆడజడ్జీలూ - ఈ ప్యారలల్ జెండర్ న్యూసెన్సంతా మగజాతికి అవసరమా ? అర్జెంటా ? ఇదంతా లేకపోతే మనగ్గడవదా ? 

స్త్రీలకి సైనికులు దూరంగా ఉన్నంతకాలమే వారు సైనికులుగా, దేశభక్తులుగా, పోరాటయోధులుగా మిగుల్తారు. స్త్రీసాంగత్యం వారిని పాడుచేస్తుందని నా అభిప్రాయం. ఈ దృగ్విషయాన్ని కొంతమంది మగవాళ్ళ వ్యక్తిగత బలహీనతగా చూడడం, వారిని శిక్షిస్తే అంతా చక్కబడుతుందని భావించడం చాలా పొఱపాటు. అలా భావిస్తే అది భర్తృహరి సుభాషితమో, ఈసప్ నీతికథో అవుతుంది తప్ప వాస్తవిక దృక్పథం అనిపించుకోదు. స్త్రీలు పనిప్రదేశాల్లో ఆశించే స్థాయి లింగాతీత మన్నింపు (treatment) ని పురుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ అందించలేరు. ఏం చేద్దాం ? సృష్టే మొదట్నుంచీ ఇలాగే ఉంది. కానీ అంతమాత్రాన ఇదంతా కోరి మీదికి తెచ్చుకోవడం అవసరమా ?

అదీ గాక, ఇలాంటి విషయాల్ని పూర్తిగా లౌకిక దృష్టితో చూడకూడదు. ఒక రంగంలో తప్పులేదని భావించబడ్డ విషయం కాలక్రమాన ఇతరరంగాలలో కూడా తప్పు లేదని భావించబడుతుంది. ఒకఱికి ఒక నిమిత్తం కోసం ఇచ్చిన వెసులుబాట్లని ఇంకొకఱు ఇంకో నిమిత్తానికి వాడుకోవడం చరిత్రలో చాలా మామూలు. ఎంత విదేశీయురాలైనా ఆడది ఆడదే కదా ? సైన్యాల మధ్య దేశభక్తి పేరుతో మొదట్లో చెదురుమదురుగా ప్రారంభమయ్యే ఆడ-మగల పరస్పర హత్యల క్యాన్సరు ఆయా సమాజాల్లోని ఇతర అవయవాలకి విస్తరిస్తుంది. ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళ బాధ్యతారాహిత్యం కూడా ! ఒక మగవాడు ఇంకో మగవాణ్ణి, లేదా ఒక ఆడది ఇంకో ఆడదాన్ని చంపడంలాంటిది కాదు ఆడా, మగా ఒకఱినొకఱు చంపుకోవడం. మన మతానుసారం ఈ కడపటిదానికి దోషం తీవ్రతరం. కానీ వివిధదేశాల సైన్యాల్లో స్త్రీలుండడం వల్ల యుద్ధసమయాల్లో ఆడవారు మగవారినీ, మగవారు ఆడవారినీ నిర్దాక్షిణ్యంగా వధించాల్సి వస్తుంది, తమ చేత చంపబడుతున్న ఆ మనుషుల ముక్కూ మొహమూ ఏమీ తెలీకపోయినా ! ఆడవాళ్ళ చేతికి ఆయుధాలివ్వడమంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపక తప్పని ఎమర్జెన్సీని, అనివార్యతనీ అవతలివాళ్ళకి కల్పించడమే. తద్ద్వారా స్త్రీపురుష జాతులు తమ మధ్య పాటించాల్సిన లింగమర్యాదల (Gender protocols) కీ, లింగకర్తవ్యాలకీ తీవ్రవిఘాతం ఏర్పడుతుంది. ఇదొక చెడ్డ సంస్కృతి. ఈ దుష్ప్రవర్తన కాలక్రమంలో సైన్యపరిసరాల్ని అధిగమించి, పౌరజీవనం (civil life) లోకి చొచ్చుకొచ్చే సంభావ్యత త్రోసిపుచ్చరానిది. 

స్త్రీలు మగవారిచేత చంపబడడానికి పుట్టినవారు కారు. పురుషులు స్త్రీల చేతుల్లో చనిపోవడానికి పుట్టినవారు కారు. స్త్రీలు మగవారిని సైతం కనడానికీ, మగవారు స్త్రీలని కాపాడడానికీ సృష్టించబడ్డవారు. స్త్రీపురుషుల నడుమ ఏ విధమైన బాంధవ్యమూ లేకపోయినా, ముక్కూమొహమూ తెలీకపోయినా కేవలం ఎదిరి లింగజాతి (opposite sex) అన్న సర్గీణ కారణం (Creational factor) వల్ల వారు ఒకఱినొకఱు దేవతామూర్తుల్లా ఆరాధించుకోవాల్సి ఉంది. పరస్పరం విలువిచ్చుకోవాల్సి ఉంది. తద్భిన్నంగా కృత్రిమమైన ఈ అంతర్‌లింగ హత్యల మూలాన ఈ ప్రకృతిధర్మం, ఆధ్యాత్మిక సూత్రం ఉల్లంఘనకి గుఱవుతాయి ఈ ఉల్లంఘనలు పాపసంచయానికి దారితీస్తాయి. స్త్రీ అనేది ఒక అవయవమో, వ్యక్తో కాక ఒక సృష్టితత్త్వానికి చెందిన పరిభావన (concept). అది సర్వాంతర్యామి. ఇలా స్త్రీలని సంహరించేవారిని గర్భంలో పెట్టుకుని మోయడానికి ఆ సర్గీణ మూలకం  (Creational Element) ఆ తరువాత తిరస్కరిస్తుంది. అందువల్ల, ఎంత ప్రయత్నించినా మఱుజన్మకి అనుమతి రాక, అందుకోసం వేచి చూడలేక, గర్భాల్లోకి దూకుడుగా gate-crash చేసిన ఆత్మలు గర్భస్రావాల ద్వారానూ, మృతశిశు జననాల ద్వారానూ అంతే బలవంతంగా, నిర్దాక్షిణ్యంగా, అర్ధాంతరంగా గర్భాల్లోంచి వెళ్ళగొట్టబడతాయి.

పురుషత్వం కూడా అలాంటి విశ్వవ్యాప్తమైన సర్గీణ మూలకమే కనుక అది కూడా పురుషహత్యలు చేసే స్త్రీలకి మరణానంతరం పునా రేతస్ ప్రవేశాన్ని నిరాకరిస్తుంది. ఒకవేళ ఇతరేతర పుణ్యఫలాల మూలాన తప్పనిసరై అనుమతించినా, అలా పుట్టిన స్త్రీలు అనంతరం పురుషవ్యక్తుల చేతుల్లో దారుణాతి దారుణమైన హింసలకి, లేదా హత్యకి గుఱికావాల్సి వస్తుంది. ప్రభుత్వవిహిత కర్తవ్యమూ, దేశభక్తీ, సమానత్వాల గొడవా ఎలా ఉన్నా, వీటి మూలాన వందలాది వేలాది సంవత్సరాల పాటు పుట్టగతుల్లేక స్త్రీపురుషులకి పిశాచ జన్మలు సిద్ధిస్తాయి.

మన వ్యవస్థల్నీ, సమాజాన్నీ కొన్ని నడమంత్రపు, నశ్వర విదేశీ సిద్ధాంతాల ఆధారంగానే కాక, మన సనాతన సంస్కృతీ సంప్రదాయాలకీ సైతం అనుగుణంగా నిర్మించుకోవాల్సి ఉంది. ఇప్పటిలా ఇంట్లో ఒక విధమైన జీవనశైలీ, బయట మఱో విధమైన జీవనశైలీ అవలంబిస్తున్న ఆధునిక భారతీయుల ద్విపాత్రాభినయం Dr. Jekyll and Mr. Hyde లాంటి మానసిక రుగ్మత అని చెప్పక తప్పదు.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్