3.11.11

ఉన్మాదమూలాలు



శావతారం చిత్రంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించనందుకూ, జపించి శివపారమ్యాన్ని అంగీకరించనందుకూ చోళరాజు ఒక వైష్ణవ పూజారి (కమలహాసన్) ని పెరుమాళ్ళ మూలబేరంతో సహా కట్టగట్టి సముద్రంలో విసిరి పారేయించిన సన్నివేశాన్ని అందఱూ వీక్షించే ఉంటారు. వీక్షించి "ఆహా ! ఆ రోజుల్లో ఎంత మతోన్మాదం ! అప్పుడు మనం పుట్టకపోవడం, లేదా ఇప్పుడు మన పాలకులు అలాంటి మతోన్మాదులు కాకపోవడం మన అదృష్టం కదా !" అని ముక్కున వేలేసుకుని ఉంటారు. ఆగండాగండి ! అక్కడికే వస్తున్నాను.

ఉన్మాదాలు ఎక్కడికీ పోలేదు. మన మధ్యనే ఉన్నాయి భద్రంగా ! ఎటొచ్చీ కాస్త పిల్లల్ని పెట్టి, కొత్త వేషధారణలో ముస్తాబై యథాపూర్వం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. కారణం - ఆనాటి ఉన్మాదాలకీ, ఈనాటి ఉన్మాదాలకీ మూలం ఒక వర్గమే. జనం అనుకుంటున్నదానికి భిన్నంగా, మీడియాలో జఱుగుతున్న ప్రచారానికి విరుద్ధంగా - నిజానికి ఈ ఉన్మాదాలేవీ ప్రజలలో పుట్టి ప్రజల ద్వారా కొనసాగుతున్నవి కావు. జాగ్రత్తగా గమనించి గుర్తుపట్టగలిగితే - ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ ఉన్మాదం జడలు విఱబోసుకొని వికటాట్టహాసం చేస్తూ, వీరవిహారం చేస్తుందన్నా దాని వెనక తప్పనిసరిగా ఒక చట్టబద్ధ ప్రభుత్వం దాగుంటుంది, ఆనాటి రాజుల్లాగే ! అది ప్రజాస్వామిక ప్రభుత్వం కూడా కావచ్చు. దాని వెనక ఒక రాజకీయ పక్షమో, రెండు పక్షాలో కూడా ఉండొచ్చు. వాటి విధానాలూ, కార్యావళులూ (policies and agendas) ఉంటాయి. ఆ ప్రభుత్వం చేసిన అన్యాయపూరిత నిర్బంధక చట్టాలూ (oppressive laws), వాటి చిరకాల దుష్ఫలితాలూ ఉంటాయి.

ప్రభుత్వంలోని వ్యక్తుల పట్ల ప్రజల్లో మొదట్నుంచీ భయమే తప్ప భక్తి శూన్యం. ప్రభుత్వం నీతులు చెబితే జనం పట్టించుకోరు. పూర్తిగా కాదు గానీ రాజఱికానిక్కూడా ఈ మాట కాస్తో కూస్తో వర్తిస్తుంది. రాజు ఏ మతాన్నైతే అవలంబించి పోషిస్తాడో ఆ మతం పట్ల ఇతర మతాలకి చెందిన పౌరుల్లో ద్వేషం మొగ్గతొడుగుతుంది. "రాజమతం" తరఫున ఏం జఱిగినా అదంతా ఇతర మతాల్ని అణచి వేయడానికే నన్న భావన వ్యాపిస్తుంది. అది రాజమతోన్మాదంగా చూడబడుతుంది. ఆ భావనలో దాన్ని ఎదుర్కోవడం కోసం దానికి ప్రతిగా సమాజంలో ఇతరేతర మతోన్మాదాలు రూపుదిద్దుకుంటాయి. అయితే ఇవి అనాధికారిక వ్యక్తుల మతోన్మాదాలు గనుక వీటిని రాజవర్గం నేఱంగా పరిగణిస్తుంది. అలా ప్రభుత్వ విధానాలకీ, వాటికి వ్యతిరేకించేవారికీ మధ్య ఒక హింసాత్మక ఘర్షణ వాతావరణం నెలకొనడం మొదలవుతుంది. ఈ ఘర్షణలు అడ్డూ, అదుపూ లేకుండా ముదిరిపోయి ఆఖరికి బైటివాళ్ళ సహాయ సహకారాలతో ఆ ప్రభుత్వాన్ని కూలద్రోసే దాకా పరిస్థితులు విషమిస్తాయి. దీనికి మన దేశచరిత్ర యావత్తూ సజీవ దృష్టాంతమే.

అలాగే, ఈ రోజుల్లో ఉగ్రవాదాన్ని (terrorism) అతిపెద్ద సమస్యగా అన్నిదేశాలూ భావిస్తున్నాయి. అది కొంతమంది దారితప్పిన యువత తాలూకు సమస్యగా, ఒక మానసిక రుగ్మతగా చూసేవారున్నారు. ఉగ్రవాదాన్ని దాని యొక్క బాహ్యరూపాల నుంచి కాసేపు వేఱుచేసి, దాన్ని వ్యవస్థపై బాధితులు జఱుపుతున్న హింసాత్మక తిరుగుబాటుగా, బహిరంగ నిరసనగా చూసినప్పుడు కొన్ని కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి. సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ మార్గాలున్నప్పుడు నిరసన తెల్పడానికి ఈ రకమైన హింసాత్మక చర్యలు అవసరమా ? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇందులో నాలుగు సూక్ష్మాలు ఇమిడి ఉన్నాయని ఈ ప్రాశ్నికులు గ్రహించలేకపోతున్నారు. ఒకటి - తక్కువ వోట్లున్న వర్గాల్ని ప్రజాస్వామిక ప్రభుత్వాలు పట్టించుకోవు, ఎంత ప్రజాస్వామిక పద్ధతుల్లో, రాజ్యాంగచట్రాల పరిధిలో నిరసన వ్యక్తం చేసినా ! రెండోది - మీడియా దృష్టిని ఆకర్షించకుండా ఏ సమస్యనీ ప్రభుత్వం దాకా తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది. అలా ఆకర్షించాలంటే చాలా డబ్బుండాలి. మూడోది - శాంతియుత నిరసనల్ని సమాజం పట్టించుకోవడం మానేసి చాలా కాలమవుతోంది. పీకల మీదికి వస్తే తప్ప ఇతరుల బాధల్ని పట్టించుకోనంత అసున్నితులుగా, కర్కశ హృదయులుగా మారిపోయారు. అంటే నిజానికి, ఉగ్రవాదుల్లో ప్రతిఫలిస్తున్నది ఈ కాలపు జనసామాన్య క్రౌర్యమే.

నాలుగోది చాలా ముఖ్యమైన అంశం. సమానత్వం, గోంగూర అంటూ పైకెన్ని కబుర్లు చెప్పినా మన చట్టాలేవీ యావత్ సమాజాన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి కావు. అవి ఎల్లప్పుడూ సమాజంలో ఫలానా ఫలానా వర్గాలకి వత్తాసు పలకడం కోసం తయారుచేసినవి. అందఱి చేతా వోట్లేయించుకునే ప్రభుత్వం ఒకఱి వైపు పక్షపాత పూరితంగా నిలబడుతుంది. ఫలితంగా ఫలానా ఫలానా వర్గాలకి అనుకూలమైన కోణంలోనే వ్యాజ్యాల్ని చూడమనీ, వారికి అనుకూలంగానే దర్యాప్తు చేయమనీ, వారి కనుకూలంగానే తీర్పులు చెప్పమనీ న్యాయస్థానాలపై ముందస్తుగా మానసిక ఒత్తిడి పెట్టే శైలిలో మన చట్టాలన్నీ రచించబడ్డాయి. ఇక్కడ న్యాయానికీ, ధర్మానికీ, క్షేత్రస్థాయి వాస్తవాలకీ తావులేదు. వారివారి వర్గీయ గుర్తింపుల్ని బట్టి ఎవఱు న్యాయస్థానంలో గెలవబోతున్నారో ఈ దేశంలో కళ్ళు మూసుకొని జోస్యం చెప్పేయొచ్చు బొడ్డూడని బుడ్డోడు కూడా !

పర్యవసానంగా ఏమవుతుందంటే, ఒక వ్యాజ్యంలో అగ్రకులస్థుడూ, నిమ్నకులస్థుడూ కక్షిదారులయితే, తీర్పు నిమ్నుడికే అనుకూలంగా వచ్చేలా చట్టాలు రాసేశారు. అలాగే ఒక యజమానుడూ, అద్దెదారూ కక్షిదారులయితే తీర్పులన్నీ అద్దెదారుకి అనుకూలంగా వచ్చేలా రాసేశారు. అదే విధంగా ఒక ఆడదీ, మగవాడూ కక్షిదారులయితే తీర్పులన్నీ ఆడదానికి అనుకూలంగా వచ్చేలా రాసేశారు. ఒక భూస్వామీ, ఒక కౌల్దారూ కక్షిదారులైతే తీర్పులన్నీ కౌల్దారుకి అనుకూలంగా వచ్చేలా రాసేశారు. అంటే ఇక్కడ అగ్రకులస్థుడూ, అద్దెదారుడూ, మగవాడూ, భూస్వామీ వీళ్ళంతా తమ తమ ప్రతివాదుల్ని బట్టి చట్టంలో రెండో తరగతి పౌరులుగా మార్చబడ్డారన్నమాట. ఏడువ్, మొత్తుకో, చొక్కా చించుకో, నేలమీద పడి దొర్లు, ఏమన్నా కా, వీళ్ళకి వ్యవస్థ న్యాయం చేయదు గాక చేయదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదనే నిబంధనలు ఖచ్చితంగా, స్పష్టంగా, చాలా పబ్లిగ్గా ఆయా చట్టాల్లో పొందుపఱచబడ్డాయి. అంటే నువ్వొక దేశపౌరుడిగానో, అందఱిలాంటి ఒక Tax payer గానో, కనీసం ఒక మానవుడిగానో కాక What you are in relation to someone అనే ప్రాతిపదిక మీద నీకు న్యాయం జఱగొచ్చు. జఱక్కపోవచ్చు. ఇదీ వాస్తవ పరిస్థితి.

అంటే ప్రజాస్వామికంగా నిరసన తెల్పడానికీ, న్యాయస్థానాల్లో న్యాయాన్ని పొందడానికీ, రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో ప్రవేశించి తమ గోడు వినిపించడానికీ అవకాశం లేని అల్పసంఖ్యాకులూ, మధ్యతరగతివాళ్ళూ, చట్టపరంగా రెండో తరగతి పౌరులూ అయినవాళ్ళని ఈ ప్రజాస్వామ్యాల్లో దిక్కూమొక్కూ లేని అనాథలుగా వదిలేశారు. ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు, వాళ్ళని తామొక వర్గంగా పరిగణించక పోవడాన ఆ ప్రాతిపదికన వాళ్ళ వోట్లు తమకి అవసరం లేదు గనుక ! అంటే ఎవడు ఏ సందర్భంలో ఏ వర్గ ప్రాతిపదికన ఆలోచించాలో కూడా వీళ్లే చెబుతారు అన్యాపదేశంగా ! దీని మూలాన ఏమవుతుందంటే ఒక సందర్భంలో ఒకానొక వర్గీయ నామాంకం (sectarian label) పెట్టుకుని లాభపడ్డవాడు ఇంకో సందర్భంలో ఇంకో వర్గీయ నామాంకం మూలాన నష్టపోవచ్చు. అంటే మీరు దళితులుగా గెలిస్తే మగవారుగా ఓడిపోతారు. లేదా మీరు ఆడవారుగా గెలిస్తే అగ్రకులస్థురాళ్ళుగా ఓడిపోతారు. అయితే మీరు ఏదో ఒక వర్గీయ ఉన్మాద చట్టం (fanatic sectarian law) పరిధిలోకొచ్చి అరుదుగా నైనా ఎంతో కొంత లాభపడుతున్నారు గనుక అన్ని ఇతరేతర వర్గీయ ఉన్మాదాలకీ చచ్చినట్లు మద్దతిచ్చితీఱాల్సిన అనివార్యతలో పడిపోతారు. అలా ఇఱికించి పారేశారన్నమాట మిమ్మల్ని. ఆ విధంగా మీ ప్రమేయం లేకుండానే మీరు ఈ ఉన్మాద వ్యవస్థ (fanatic system) లో క్రియాశీల భాగస్వామిగా మార్చబడ్డారు. అందఱమూ వర్గాతీతంగా నిష్పక్షపాతంగా ఆలోచించాలని డిమాండు చేసే సహజహక్కుని కోల్పోయేలా చేయబడ్డారన్నమాట. ఇలాంటి ఉన్మాదాలు తప్ప మనకి వేఱేదారి లేకుండా చేశారు. వర్గాలన్నింటినీ అలా రాజకీయంగా, చట్టబద్ధంగా ఆర్గనైజ్ చేశారు. చేసి మనందఱినీ వాటికి అతీతంగా ఆలోచించమని సుద్దులు చెబుతారు. ఈ పరిస్థితుల్ని కళ్ళారా చూసి, కడుపారా అనుభవించి గుండెలు భగ్గున మండిపోయినవాళ్ళు కసిగా ఆయుధాలు చేపట్టి, హింసకి దిగితే, లేదా కనీసం సైకోలైతే ఏమైపోతుంది సమాజం ? అనే ఇంగితజ్ఞానం ఈ ప్రభుత్వాలకి లేదు. "ఆ సమయానికి అధికారం ఉంది గదా" అని అడుగడుగునా చట్టాల రూపంలో అన్యాయాల్ని ఇనుమిక్కిలిగా వ్యవస్థీకృతం చేసిపారేసి, ఆ తరువాత సమాజం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని ఆగష్టు పదిహేనున ఆకాంక్షిస్తే ఏం లాభం ?

అలాగే ప్రభుత్వం ఒక కులస్థుడి చేతిలోకి వెళితే అతను తనకి అభిమానంతో వోట్లేసిన ఇతర కులస్థులందఱినీ అమాంతం గాలికొదిలేసి తన ఒక్క కులాన్నే బాగుచేసుకోవడం మొదలుపెడతాడు. కాలక్రమంలో ఈ తెఱగు సర్కారీ కులోన్మాదానికి దీటుగా సమాజంలో మఱికొన్ని కులోన్మాదాలు పుట్టుకొస్తాయి. అదే విధంగా ప్రభుత్వం కొన్నికులాలకి అనుకూలంగా వెసులుబాట్లూ, చట్టాలూ చేయడం ఇలాంటి కులోన్మాదాల్ని ఇతోఽధికంగా వృద్ధిపొందించడానికే, తద్ద్వారా మనల్ని చావగొట్టి చంపడానికే !

కాబట్టి ఈ ఛప్పన్న ఉన్మాదాలన్నీ వివిధకాలాలకి చెందిన పలుప్రభుత్వాల ఉమ్మడి సృష్టి, పోషణ, ప్రోత్సాహఫలితాలు మాత్రమే. ఒక్క తేడా మాత్రం ఉంది. అదేమంటే, చరిత్రలో చోటుచేసుకున్న ఉన్మాద చర్యలకి పూర్వ ప్రభుత్వాల్ని (అది రాజులైనా, సుల్తాన్‌లైనా) పేరుబెట్టి నిందించడం సాధ్యమయ్యేది. ఎందుకంటే "ఫలానా ఉన్మాద చర్యకి ఫలానా రాజే కారకుడు" అని స్పష్టంగా తెలిసిపోతూండేది. దీనిక్కారణం - ఒక రకంగా ఆనాటి రాజులు ఈనాటి ప్రభుత్వాలతో పోలిస్తే కాస్త బోళా మనుషులు కావడమే. తమ చర్యల ద్వారా, మాటల ద్వారా తమ పక్షపాతాల్నీ, ఇష్టానిష్టాల్నీ బహిరంగంగా వెల్లడించేస్తూ ఉండేవారు. ఇప్పుడు తెలిసినంత Media management, రెండునాల్కల ధోరణీ వాళ్ళకి తెలీవు. కానీ ఈనాటి ప్రభుత్వాల పెద్దమనుషులు పెద్ద గజదొంగలు. వీళ్ళు మనసులో ఒకటి అనుకుంటూ, పైకి ఇంకొకటి మాట్లాడుతూ, బైట మఱొకటి చేయడంలో అద్భుతంగా రాటుదేలిపోయారు. అందుచేత సమకాలీన ఉన్మాదాల వెనకా, అతివాదాల వెనకా, టెఱ్ఱరిజాల వెనకా ఉన్నది సాక్షాత్తూ వీళ్ళేనని కనుక్కోవడం సాధారణ బుద్ధిమంతులకి ఇసుమంత కష్టమే. ఎందుకంటే తాము వాటి మీద యమా పోరాడేస్తున్నట్లు వీళ్ళు రోజూ వీరపోజులిస్తూంటారు. అదీ గాక, రాజు అంటే ఒక వ్యక్తి. గుర్తించడం తేలిక. కానీ ప్రజాస్వామిక ప్రభుత్వంలో అంతా సమష్టిబాధ్యత కావడంతో తప్పుడు మనుషులంతా గుంపులో గోవిందయ్యలై క్షేమంగా తప్పించుకు పోతారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉండగా చట్టం పేరు చెప్పి తీసుకున్న కవ్వింపుచర్యలకీ, బయట పెచ్చఱిల్లిపోతున్న వర్గీయ ఉన్మాదాల (sectarian/ communal frenzy) కీ సంబంధమేంటో అంతుపట్టక పెద్దగా ఆలోచించలేని సామాన్య పౌరులు గందరగోళంలో పడిపోతూంటారు.

ఇదివఱకటి రాజఱికాలు కేవలం చరిత్రపరిజ్ఞానలోపం వల్ల ఒకటో, రెండో ఉన్మాదాల్ని పొఱపాట్న పెంచి పోషిస్తే, ఈనాటి ప్రజాస్వామిక ప్రభుత్వాలు అంతా తెలిసే, అన్నిరకాల ఉన్మాదాల్నీ ఉద్దేశపూర్వకంగా పెంచి పోషిస్తున్నాయని అందఱూ గమనించడం అవసరం. ప్రభుత్వ మద్దతు ఉందనే ధీమాతో ఉన్మాదులయ్యే వర్గాలు కొన్ని ! లేదనే బాధతో ఉన్మాదులయ్యే వర్గాలు మఱికొన్ని ! ఏమిటిదంతా ? ప్రభుత్వ మద్దతు అనేది మనుషుల్లో అంతకుముందెన్నడూ ఎఱగని రాక్షసత్వాన్ని ప్రోది చేస్తుంది. అది సహృదయుల్ని సైతం కర్కోటకులుగా మారుస్తుంది. ఇతరుల మనోభావాల్నీ, సున్నితత్వాల్నీ ఖాతరు చేయని పశుత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రభుత్వ మద్దతు తమకుందని భావించే వర్గాలు తమ మీద ఈగ వాలినా ఆగ్రహావేశాలతో పిచ్చెక్కి రెచ్చిపోతారు. అసలు ఆ ఈగ గాల్లో ఎగరడమే నేఱమన్నట్లు మాట్లాడతారు. కల్లుతాగి, నిప్పు తొక్కిన కోతుల్లా గంతులేస్తారు. అంతటితో ఆగకుండా వర్గీయ ఉన్మాదాలు ఇంకా చాలా చాలా దూరం వెళతాయి. ఉన్మాదాల్ని వ్యతిరేకించే సామరస్యవాదులకే ఉన్మాదులని పేరుబెట్టేవాళ్ళు తయారవుతారు. ఇతర వర్గాలలో సద్గుణాలున్నా చూడలేని కళ్ళున్న కబోదులవుతారు.

రాజపోషణ విపరీతంగా ఉన్నరోజుల్లో కొందఱు బ్రాహ్మణులలో ఉండేది ఈ తెఱగు ఉన్మాదం. దీన్ని మళ్లీ గత కొద్ది దశాబ్దాలుగా దళితుల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫెమినిస్టులలో చూస్తున్నాం. ఇంకా ఏయే ప్రాతిపదికల మీద ఎన్నెన్ని సరికొత్త ఉన్మాద వర్గాల్ని ఈ ప్రభుత్వాలు తయారు చేయబోతున్నాయో చూడాల్సి ఉంది. ఏ ఒక్క వర్గానికీ అనుకూలం కాని తటస్థ చట్టాల్ని (neutral laws) రూపొందించి అమలు చేయడమే ఈ అన్ని ఉన్మాదాలకీ భేషైన విఱుగుడు. అంతే కాదు, ప్రభుత్వస్థులు వీటికి కోరి దూరంగా ఉండాలి. ప్రభుత్వం అందఱిదీను. ఏ ఒక్క వర్గానిదో, లేక కొన్ని వర్గాలదో కాదు. ఆ భావనని ప్రజల్లో కలిగించాలి. ఆ నమ్మకాన్ని పాదుకొల్పాలి. అంతేగానీ ముస్లిముల సభకి వెళ్ళి అక్కడ మైనారిటీల కష్టాల గుఱించి కన్నీళ్ళు కార్చడం, బీసీల సభకి వెళ్ళి బీసీల పరిరక్షకులం మేమేననడం, లేదా స్వకుల సమావేశాల్లో మంత్రులూ, శాసనసభ్యులూ , తదితర ప్రజాప్రతినిధులూ పాల్గొనడం, హిందూనాయకులు రంజానుకి ఇఫ్తార్ విందులివ్వడం, ఫెమినిస్టుల సభలకెళ్ళి పురుషుల్ని దూషించడం - ఇలాంటి చేష్టల మూలాన దేశంలో ఉన్మాదాలు పరాకాష్ఠకి చేఱుకుంటున్నాయి. తమ యొక్క యీ అపరిపక్వ, క్రమశిక్షణారహిత నడవడికలకి ప్రజల్లో కలిగే దుఃస్పందనల్నీ, దుష్పరిణామాల్నీ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి పక్షపాత ప్రవర్తననీ, ఉన్మాదాన్నీ ఆధికారికంగా ప్రదర్శిస్తున్నంత కాలమూ అందుకు వ్యతిరేకంగా హింసోన్మాదానికి దిగేవాళ్ళు ఉంటూనే ఉంటారు. కానీ చెబితే ఎవఱు వింటారు ? ఈ ప్రభుత్వాలు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఇంకా విభాజకమైన (divisive) సంకుచిత చట్టాలు చేసుకుంటూ పోతున్నాయి. ఇలాంటి తోలుమందపు దొరతనాల్ని పెట్టుకుని ఈ ఉన్మాదాల నుంచి మనకెలా రక్షణ లభిస్తుందో అర్థం కాకుండా ఉంది.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్