24.11.11
పిల్లల ముందు రెండో కాంచరి (parent) మీద బుఱద జల్లడం
8:24 AM వీరిచే టపా చెయ్యబడింది తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంనామాంకం (Label) ఇల్లూ వాకిలి
త శతాబ్దంలో ఏర్పడ్డ చట్టబద్ధ విడాకుల సదుపాయం మన సమాజంలో గొప్ప కౌటుంబిక అరాచకాన్ని సృష్టించింది. లేదా ఉన్న అరాచకానికి తోడు మఱికాస్త ఆజ్యం పోసింది. ఈ గొడవలు ఇతోఽధికంగా నా దృష్టికొస్తున్నకొద్దీ, మన హిందూ మతాచార్యులు ధర్మశాస్త్రాల్లో విడాకులకెందుకు స్థానం లేకుండా చేశారో కొంచెం కొంచెంగా అవగతమౌతూ వస్తోంది. కానీ ఒక మతలబుంది. ధర్మశాస్త్రాల్లో సైద్ధాంతికంగా స్థానం లేకపోయినా మన పూర్వసమాజంలో ఆచరణాత్మకంగా విడాకులనేవి లేకపోలేదు. ఎందుకంటే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో విడాకుల్ని పేర్కొన్నాడు. అందుకే ఈ "విడి ఆకులు" అనే తెలుగుపదమూ, దాని సంస్కృత సమానార్థకంగా "పరిత్యాగ పత్త్రిక" అనే మఱో పదమూ వ్యవహారంలోకి వచ్చాయి. "విడి ఆకులు" అనే ఈ పదానికి వేఱువేఱు ఆకుల్లో భోజనం చేయడం మొదలుపెట్టడమనీ, విడిపోతున్నట్లు తాటాకుల మీద వ్రాసుకోవడమనీ రెండురకాలుగా వ్యుత్పత్తి (etymology) చెబుతున్నారు పెద్దలు.
విడిపోయేనాటికి ఏడేళ్ళలోపలి పిల్లాజెల్లా ఉన్న దంపతులు తమ పిల్లలకి తమ మాజీ భాగస్వామి(ని)ని దూరం చేయడమే కాక పిల్లల దగ్గఱ వారి గుఱించి తప్పుగా మాట్లాడడం జఱుగుతోంది. అంతేకాక పిల్లల దఱిదాపులక్కూడా కన్నతండ్రులు రాకుండా దూరంగా తఱిమితఱిమి కొట్టడం జఱుగుతోంది. కొన్నిచోట్ల పిల్లల్ని చూడ్డానికొచ్చిన తండ్రుల మీద కిడ్నాప్ కేసులు పెట్టి బెదిఱిస్తున్నారు. మన దేశంలో న్యాయస్థానాలు అలాంటి పిల్లల పెంపకాన్నీ, అదుపాజ్ఞల్నీ (care and custody) సాధారణంగా తల్లులకే అప్పగిస్తాయి. కనుక ఈ సమస్య హెచ్చుగా తల్లుల మూలాన ఉత్పన్నమవుతోంది. స్త్రీలు అతిగా ప్రేమిస్తారు. అతిగా ద్వేషిస్తారు. వారిలో భావోద్వేగపరమైన సమతూకమూ, తటస్థతా సాపేక్షంగా అరుదు. తమకి నచ్చని వ్యక్తి తమ పిల్లలకి తండ్రి అయినప్పుడు ఆ సంబంధం తమ భార్యాభర్తల్లాంటిది కాదనీ, పితా-సంతాన సంబంధమనీ, అందుచేత అది ఎక్కువ పవిత్రమైనదనీ, కనుక అందులో జోక్యం చేసుకునే నైతిక హక్కు తమకి లేదనీ వారు గుర్తించడం లేదు. తమని చిన్నతనంలోనే అలా ఎవఱైనా తండ్రిప్రేమకి దూరం చేసుంటే తాము ఇంతవారు అయ్యేవారా ? తల్లికి బిడ్డల్ని దూరం చేయడం ఎంత పాపమో, తండ్రినీ పిల్లల్నీ వేఱుచేయడం కూడా అంతే పాపం. హక్కుల గుఱించి నేను వ్రాయడం లేదు. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి కావాల్సింది హక్కుల స్పృహ కాదు. మానవసంబంధాల స్పృహ. మానవ మనో సున్నితత్వాల గుఱించిన అవగాహన.
తమ కొత్త భర్తల్ని "నాన్నా" అని పిలవాలంటూ పిల్లల్ని విడాకరి స్త్రీలు ఒత్తిడి చేస్తూండడం, ఆ విషయమై ఇళ్ళల్లో అనునిత్యం హోరాహోరీ యుద్ధాలైపోతూండడం కూడా ఒక సమకాలీన దృగ్విషయం. నిజానికి కన్నతండ్రి కంటే వేఱైన ఇతరుల్ని "నాన్నా" అని పిలవడం మానవసమాజంలో ఎప్పుడూ వాడుకలో లేదు. ఎందుకో గానీ "అమ్మా" అనే పిలుపుకి ఇది వర్తించదు. ఒక భార్య పోతే ఇంకో భార్య వస్తుంది. ఒక భర్త పోతే ఇంకో భర్త వస్తాడు. కానీ ఒక తల్లి పోతే ఇంకో తల్లి రాదు. ఒక తండ్రి పోతే ఇంకో తండ్రి రాడు. వారి బాధ్యతల్ని తీసుకున్నవారు, ఎంత నిజాయితీగా తీసుకున్నా సరే, అసలువాళ్ళ మసకబింబాలే తప్ప అసలుమనుషులెన్నటికీ కారు. కాలేరు. వారు ఒక పాత్రని స్క్రిప్టు ప్రకారం పోషిస్తున్నవారే తప్ప అందులో ఆత్మికంగా జీవిస్తున్నవారు కారు. బయటి మనుషుల్ని "అమ్మా, నాన్నా" అని పిలవడం సౌలభ్యార్థమే గానీ వారు అమ్మానాన్నలెన్నటికీ కారు. తల్లి, తండ్రి అనే పదాలు ప్రత్యామ్నాయం లేనివి. అవి సాటిలేనివి. ఆ పిలుపులు అత్యంత బరువైనవి. గంభీరమైనవి. అవి పరమపవిత్రమైనవి. అందుచేత తమ మనసు మారిపోయింది గనుక తాము ఒక మనిషిని తమ మనసులోంచి చీమిడిలా తుడిచిపెట్టేశారు గనుకా, అలా చేయడం తమకి మంచినీళ్ళప్రాయం గనుకా పిల్లలు కూడా అలాగే చేయాలని ఒత్తిడి చేయడం ఒక రకంగా మానసిక చిత్రహింస, శైశవ వేధింపు (Child abuse). పిల్లలు అలా చేయలేరు. మానవ సంబంధాల్ని తీఱిక చేయడం, వాటికి ద్రోహం చేయడం పెద్దలకి చేతనైనట్లుగా చిన్నపిల్లలకి చేతకాదు. వాళ్ళు జంతువుల్ని కూడా మనుషుల్లా మన్నించే మనసున్నవాళ్ళు. తండ్రిని గడ్డిపఱకలా తీసిపారేయడం వాళ్ళకి ఎలా కుదురుతుంది ? అసలది సమర్థనీయమేనా ? అని !
పిల్లల జీవితంలో తల్లి తొలిస్త్రీ. ఆమె ప్రవర్తనని బట్టి ప్రపంచంలోని స్త్రీలందఱి పట్లా ఒక వైఖరిని అభివృద్ధి చేసుకుంటారు పిల్లలు. అలాగే వారి జీవితంలో తొలి పురుషుడు తండ్రి. అతన్ని బట్టి యావత్ పురుషప్రపంచం మీదా ఒక అంచనాకొస్తారు పిల్లలు. అలా తల్లిదండ్రుల్ని బట్టి పిల్లలు తమ నమూనాపాత్రల (role models) నీ, ఆదర్శాల్నీ, ప్రతిస్పందనల్నీ నిర్మించుకుంటారు. అందుచేత అవి చాలా బాధ్యతాయుతస్థానాలు. అలాంటి స్థానంలో ఉంటూ ఆ స్థానాన్ని రెండో కాంచరి (the other parent) మీద విషం కక్కి పిల్లల మనసుల్ని కలుషితం చేయడానికి దుర్వినియోగం చేయడమంటే - ఒక ఆడపిల్లని మగజాతికి దూరం చేయడం. ఒక మగపిల్లవాణ్ణి స్త్రీజాతికి వ్యతిరేకంగా తిప్పడం. ఇది వాళ్ళ జీవితాల్ని మొగ్గలోనే త్రుంచిపారేయడం. వాళ్ళని భావోద్వేగ వికలాంగులు (emotinally handicapped) గా మార్చడం. తాము ఆస్వాదించిన మానవసంబంధాల రుచీ, పరిమళమూ వారికందకుండా చేయడం. వాళ్ళని తప్పుడు సామాజిక ప్రవర్తన అనే ఒక విషవలయంలోకి తోయడం. దీని మూలాన ఆ పిల్లలు తమ భావి వయోజన జీవితం (adult life) లో అనేక సందర్భాలకి పనికిరానివాళ్ళుగా, విఫలులు (failures) గా మారతారు. మఱోపక్క - ఆ తండ్రి ఆ విడాకుల అనంతరం కాలక్రమంలో గొప్ప ధనికుడైతే, అతనివల్ల ఆ పిల్లలకి సాధారణ పరిస్థితుల్లో ఒనగూడాల్సిన ప్రయోజనాలేవీ ఒనగూడకుండా పోతాయి. వారు చిల్లఱమల్లర భరణాలకి (maintenance) మాత్రమే నోచుకుంటారు. 18 ఏళ్ళ వయసు దాటితే అది కూడా ఉండదు.
తండ్రుల ప్రేమపూరిత హృదయాన్ని, వారి ఆత్మల ఆక్రోశాన్ని కూడా స్త్రీజాతి అర్థం చేసుకోవాలి. పైకి వ్యక్తీకరించనంత మాత్రాన మగవారి భావోద్వేగాల్ని తక్కువ అంచనా వేయరాదు. పితృత్వభావనకి జఱుగుతున్న ఈ అపచారం కొద్దిమంది స్త్రీల మూలంగా జఱుగుతున్నదే అయినప్పటికీ, ఎవఱూ అభ్యంతరం చెప్పని చట్టాలూ, ఫెమినిజమ్ రూపంలో ఇందుకు అందఱి ఆమోదమూ ఉన్నట్లే లెక్క. తద్ద్వారా ఇది అందఱమూ పాల్గొంటున్న ఒక సామూహిక పాపంగా పరిణమిస్తోంది. సామూహిక పాపాలకి సామూహిక శిక్షలుంటాయి. అందువల్ల మానవజాతికి సమీప భవిష్యత్తులో పితృరక్షణ సంపూర్ణంగా ఉపసంహరించబడే ప్రమాదం పొంచి ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)






4 వ్యాఖ్యలు:
కాంచరి పదప్రయోగం కొత్తగా ఉంది
గుడ్ పోస్ట్ తాడేపల్లి గారు. మీరు ఇలాగే వ్యాఖ్యా సౌలభ్యాన్ని కొనసాగించాలని మా విన్నపం
ఏదో చేయబోయి ఏదో చేస్తే ఈ వ్యాఖ్యాసౌకర్యం మళ్ళీ బ్లాగులో ప్రవేశించింది. చూద్దాం. పఠితల సంస్కారాన్ని బట్టి ఇది కొనసాగొచ్చు. లేదా కత్తిరించబడవచ్చు.
తాడేపల్లి గారు..వేరే ఆలొచన లేకుండా మీ బ్లాగులో వ్యాఖ్యా సౌలభ్యాన్ని కొనసాగించమని మనవి.
మీరు వ్యాఖ్యా సౌలభ్యాన్ని తొలగించిన రోజులకీ ఈ రోజుకీ బ్లాగుల్లో చాలా మార్పు ఉంది లేండి. ఆ రోజుల్లో కామెంటింగ్ మాఫియాకి అడ్డూ అదుపూ ఉండేది కాదు, కెలికిన వాడికి కెలికినంత, ఇప్పుడు వాళ్ళకి ఏకుకి మేకుల్లాంటి వైరి వర్గం తయారైంది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.