21.11.11

సౌష్ఠవవాదం (perfectionism) "అతి" అయితే ?



న్నితత్వాన్ని సద్వినియోగం చేయాలనీ, మన సున్నితత్వాల ప్రేరణతో ఇతరుల సున్నితత్వాల్ని దెబ్బదీయకూడదనీ ఇదివఱకొకసారి ఈ బ్లాగులో వ్రాశాను. ఈ విషయమై నా గొంతుతో ఒక శ్రవ్యకాన్ని కూడా జాలంలోకి ఎక్కింపు చేసి ఉన్నాను. సున్నితత్వం లాంటిదే సౌష్ఠవవాదం (perfectionism) కూడా ! మితిమీఱితే, సందర్భనిరపేక్షంగానూ విశృంఖలంగానూ ప్రయోగిస్తే ఎంతటి సుగుణమైనా దుర్గుణంగా మారిపోతుందనడానికి ఈ రెండూ మంచి ఉదాహరణలు కావచ్చు. అంతే కాదు, కొన్నికొన్ని లక్షణాలు వ్యక్తిగతాలకి పరిమితమైతే ఒక రకంగానూ, సమాజమంతా విస్తరిస్తే మఱో రకంగానూ ప్రభావాన్ని చూపిస్తాయి. మొన్న మా పొఱుగింటి పశ్చిమ గోదావరాయనతో పిచ్చాపాటీ మాట్లాడుతూండగా ఆయన అన్నాడు : "మనుషులున్నది ప్రేమించడానికి. వస్తువులున్నది వాడుకోవడానికి. కానీ ఆధునిక ప్రపంచంలో మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని వాడుకుంటున్నాం. ఎంత ప్రకృతివిరుద్ధమో చూశారా ?" అని ! నిజమేననిపించింది. ఇది మన కాలపు పదార్థవాదం (materialism) ఫలితం కావచ్చునని చాలామంది అనుకుంటారు. పూర్తిగా కాదని నేనంటాను. ఎందుకంటే మన ఇష్టానిష్టాలన్నీ వస్తువులూ, లేదా మనుషులు ఖచ్చితంగా సౌష్ఠవం (perfect) గా ఉండాలనే దృఢమైన అభిప్రాయాల ప్రాతిపదిక మీద ఏర్పఱచుకున్నటువంటివి. ఆ స్థాయి సౌష్ఠవం వాటిల్లో కనిపించకపోతే మనం వాటిని ఇష్టపడ్డమే మానేస్తున్నాం.

మనలో మనకి తెలీకుండానే లోతుగా లోలోతుగా జీర్ణించిపోయిన ఈ సౌష్ఠవవాదం ప్రకారం - చదువన్నాక అది మేధనీ, శరీరాన్నీ, జీవితాన్నీ కూడా సమానంగా పోషించాలి. లేకపోతే అది చదువే కాదు. ప్రభుత్వమన్నాక అది మన యావత్తు జీవితాలకీ బాధ్యత తీసుకోవాలి. కొడుకన్నాక వాడు మన మాట వినాలి, తనకే కాక మనకీ, ఇంకా మన వంశానికీ ఉపయోగపడాలి. మన అభిరుచుల్నీ, మనం జీవితాంతం కూర్చొని పోగేసిన చెత్తనంతటినీ వాడు కాపాడాలి. భార్యన్నాక ఆమె భర్తకి సేవా చేయాలి. ఇంటిపనులూ చేయాలి. పిల్లల్ని కనివ్వాలి. వాళ్ళ పెంపకం కోసం అహోరాత్రాలూ తన అస్థీ చర్మమూ నిశ్శేషంగా ధారపోసితీఱాలి. పుట్టింటిని శాశ్వతంగా మర్చిపోయి అత్తింటికే అంకితం కావాలి. భర్తన్నాక అతను బాగా డబ్బు సంపాదించాలి. సంపాదించి తన చేతుల్లో పోయాలి. భార్యని యమా "సుఖ"పెట్టాలి. ఆమెని ఎల్లప్పుడూ బాగా ఎంటర్‌టెయిన్ చేస్తూండాలి. గుఱితప్పని సంతానోత్పాదక శక్తి ఉండాలి. కుటుంబాన్ని భౌతికంగా రక్షించాలి. మొగుడంటే ప్రతి ఇతర ఇల్లాలూ చూసి అసూయపడేంత లెస్సగా ఉండాలి. మనమిలా పైకి వ్యక్తీకరించకపోయినా ప్రతీదాని గుఱించి మన మనో పొఱల్లో ఈ ఆశంసలు (expectations) సుస్థిరంగా పాతుకుపోయాయి. ఇల్లంటే ఇలా, భోజనం అంటే అలా, మంచం అంటే ఇంకోలా, విద్యాలయం అంటే మఱోలా ! ఈ ఆశంసలకి కాస్త వ్యతిరేకంగా, లేదా తేడాగా ఏదైనా జఱిగితే మనుషులు అనవసరంగా క్రుంగుబాటు (depression) కి లోనవుతున్నారు. లేదా ఆగ్రహోదగ్రులవుతున్నారు.

లోకం అంత సౌష్ఠవంగా సృష్ఠించబడలేదు. జీవితం అంత సౌష్ఠవం గలది కాదు. మన శరీరాలే అంత సౌష్ఠవం గలవి కావు. అథవా ఎక్కడైనా ఇలాంటి సౌష్ఠవం అనుభవంలోకి వచ్చినా అది తాత్కాలికమే తప్ప మనం ఆ అనుభవాన్ని చంకన పెట్టుకొని మోసుకెళ్ళలేం. కనుక ఈ ఆశంసలూ, సౌష్ఠవాలూ అన్నీ ఆదర్శాలే తప్ప వాస్తవం కావు. మనం ఆలోచన లేకుండా సదా వీటి వెంటపడడం ఎండమావుల్లో నీళ్ళు తాగబోవడం లాంటిదే. సౌష్ఠవవాదం కొన్ని ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రమాణాలు ఎల్లవేళలా మారిపోతూనే ఉంటాయి. కాబట్టి ఈనాటి సౌష్ఠవం ఱేపటికి అసౌష్ఠవమే కావచ్చు.

"ఇది తప్పు - ఇది ఒప్పు" అనే పరిభావనలే సౌష్ఠవవాదానికి మూలం. ఈ తప్పొప్పుల్ని ఎవఱు నిర్ణయిస్తారు ? మతవిషయాల్లో మతగ్రంథాలూ, లోకవ్యవహారంలో సంఘసంప్రదాయాలూ, లౌకిక శాస్త్రాలూ, ప్రభుత్వచట్టాలూ, పెద్దల అనుభవాలూ ! ఇవి కాక, వీటన్నింటినీ తలదన్ని అన్ని తప్పొప్పులకీ మూలకందమైనవి రెండున్నాయి ప్రపంచంలో ! అవి వ్యక్తిగత ఇష్టానిష్టాలు. నిజానికి ధర్మం, నీతీ, న్యాయం పేరుతో చెలామణీ అవుతున్నవన్నీ వ్యక్తిగతమైన ఇష్టానిష్టాల రూపాంతరాలేనని చెప్పుకోవచ్చు. ఇష్టానిష్టాల్ని తీసేస్తే వీటికి వేఱే నామరూపాల్లేవు. ఇతరుల ఇష్టాల్ని తన ఇష్టాలతో సరిగ్గా సమన్వయించకపోతే అఱిచి గీపెడతారు. అవతలివాడి సులోచనాల్ని మనం ధరించి, అతని చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టకపోతే అధర్మం, అన్యాయం, అక్రమం అని గగ్గోలు పెడతారు. అది అక్రమం ఎందుకయిందయ్యా ? అంటే అది ఎవడి ఇష్టానికో వ్యతిరేకం గనుక ! వేఱే కారణమేమీ లేదు. "ఇది సక్రమం, ఇది అక్రమం" అని దేవుడు దిగొచ్చి ఎప్పుడూ చెప్పినట్లు కనపడదు. ఆయన పేరుతో తమ వ్యక్తిగత ఆదేశాల్ని చెలామణి చేసేవాళ్ళు మటుకు అత్యధికంగా కనపడుతున్నారు. ఈ మీమాంస తేలక  "ఏది పుణ్యం ? ఏది పాపం ? ఓ మహాత్మా ! ఓ మహర్షీ !" అని ఒకప్పుడెవఱో వేదవ్యాసులవారిని అడిగితే ఆయన "పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్" అనేసి ఊరుకున్నాడట. అంటే - ఇతరుల్ని పీడిస్తే పాపం. వారికి ఉపకారం చేస్తే పుణ్యం. అంటే ధర్మం అని మనం అనుకుంటున్నదానికి మూలం స్వార్థమే తప్ప నిఃస్వార్థం కాదని తేల్తోంది. అది మీ స్వార్థం కాకపోవచ్చు. మీ అహం కాకపోవచ్చు. ఎవఱో ఇతరుల స్వార్థం. ఇతరుల అహం. మొత్తమ్మీద స్వార్థమే.

కానీ వ్యాసులవారు సెలవిచ్చిన ఈ అపకార-ఉపకారాలతో సంబంధం లేని ఊహాజనిత పాపాలూ, ఊహాజనిత పుణ్యాలూ చాలా చాలా వచ్చేసి కూర్చున్నాయి మన సమాజంలో కాలక్రమాన ! ఇప్పుడు కూర్చుంటే పాపం, నిలబడితే పాపం. పరిగెడితే పాపం. ప్రతీదానికీ పాపమే. సమాజంలో కొంతమందికి కొన్ని ఉమ్మడి ఇష్టానిష్టాలుంటే వాళ్ళందఱూ కలిసి వాటినొక శాస్త్రంగానో, చట్టంగానో చేసి మిహతావాళ్ళ నెత్తిన ఆధికారికంగా రుద్దేస్తారు. వాళ్ళ ఇష్టానిష్టాలు ప్ర్రమాణమైపోయాక అదో రకం కొలబద్దగా, సౌష్ఠవవాద దృక్కోణంగా పరిణమించడం మొదలవుతుంది. అంటే ఇక్కడ ఏం జఱుగుతోందంటే - ఏయే ఇష్టాలకీ, ఆశలకీ, ఆకాంక్షలకీ వ్యవస్థాగతమైన ఆశ్రయమూ, తోడ్పాటూ (institutional support) ఉన్నాయో వాటినేమో ఒప్పులుగా చూస్తున్నారు. అందుకు నోచుకోని ఇష్టాలనేమో తప్పులుగా చూస్తున్నారు. ఒకే వస్తువు లేదా మనిషి వేఱువేఱు ప్రదేశాల్లో ఉంటే పరిసరాల్ని బట్టి వేఱువేఱుగా సంభావిస్తారు జనం.  ఒక బొమ్మ రోడ్డుమీద పడేసి ఉంటే అందఱూ తొక్కుకుంటూ వెళతారు. దాన్నే కొట్లో అద్దాల చాటున పెడితే బొమ్మల కొలువు (showcase) కోసం డబ్బిచ్చి మఱీ కొనుక్కుంటారు. అదే గుళ్ళో కనిపిస్తే సాగిలపడి మొక్కుతారు. ఆశలూ, ఆకాంక్షలూ ఇలాంటి బొమ్మలనుకుంటే ఇల్లూ, బొమ్మల కొట్టూ, దేవాలయం మొదలైన పరిసరాలు వ్యవస్థలన్నమాట.

ఇంగ్లీషు మీడియమ్ స్కూళ్ళలాంటి వ్యవస్థల్లో తెలుగులో మాట్లాడాలనే కోరిక తప్పుగా భావించబడుతుంది. అది నిజంగా తప్పా ? అంటే కాదు. దానికి వ్యవస్థ తోడ్పాటు లేకపోవడమే అది చేసిన తప్పు. మేనచెల్లెలి (cousin sister) ని పెళ్ళాడడం పశ్చిమాసియాలో తప్పు కాదు. అక్కడ అదొక మతవ్యవస్థలో భాగం. ఇక్కడ చాలా తప్పు. అది నిజంగా తప్పేనా ? అంటే బహుశా కాకపోవచ్చు. ఇక్కడి వ్యవస్థలో దానికి స్థానం లేదంతే. తత్సమాంతరంగా ఇక్కడ స్థానమున్నదల్లా మేనకోడల్నీ, మేనమఱదల్నీ చేసుకోవడానికి మాత్రమే. ఇందులో మతలబేంటంటే - వ్యవస్థల్ని బట్టి తప్పొప్పులూ, ఇష్టానిష్టాలనేవి ఏర్పడుతున్నాయని గ్రహించకుండా, తప్పొప్పుల్ని బట్టే వ్యవస్థలు ఏర్పడుతున్నాయనీ, అందుచేత తమ వ్యవస్థలన్నీ పరమ పరిశుద్ధాలనీ, ధర్మదేవత యొక్క అవతారాలని జనం భ్రమించడం. భ్రమించి ఆ ప్రమాణాల చుట్టూ సౌష్ఠవవాదాల్ని నిర్మించడం. నిర్మించి వాటితో అవతలివాళ్ళని హింసించడం. అంతటితో ఆగకుండా ఈ వ్యవస్థల్ని ఎఱగని పూర్వీకుల ప్రవర్తనని కూడా ఆ రకమైన సౌష్ఠవవాదపు దుర్భిణీ అద్దాల కింద పెట్టి పరకాయించడం. పాకిస్తానీ వ్యవస్థలో పుట్టిపెఱిగినవాడు నిష్కారణంగా భారతీయుల్ని ద్వేషించడం నేర్చుకుంటాడు. భారతీయ వ్యవస్థలో పుట్టిపెఱిగినవాడు అమెరికాని ఆరాధించడం నేర్చుకుంటాడు. వ్యవస్థలు నేర్పే ఇష్టానిష్టాలివి.

తప్పొప్పులనేవి మనం అనుకుంటున్నంత బద్ధశత్రువులు కావు. అవి ఒకదానికొకటి ప్రాణమిత్రులు. ఒకదాని భుజం మీదినుంచి ఇంకొకటి తొంగి చూస్తూంటుంది. మనుషుల్లో పాతివ్రత్యం గొప్ప లక్షణం ఎందుకయింది ? వివాహమనే వ్యవస్థ వల్ల కాదూ ? మఱి మనుషులకి వివాహం ఎందుకవసరమయింది ? మానవులకి ఋతుప్రసక్తి లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ తోడు కావాల్సొచ్చి కాదూ ? అంటే పాతివ్రత్యం అనే మహాశక్తి, మహాదర్శం వెనక ఉన్న పునాది అతికామమనే బలహీనతే. అంటే పాతివ్రత్యానికి అంటుకునే ఉంది తీవ్రమైన పురుషవాంఛ. అయితే అది తన పూర్వ అవలక్షణాల్ని వదిలించుకొని ఏకపురుషాశ్రితంగా సమున్నతీకృతమయింది. అలా మనం గమనించినప్పుడు, గొప్ప విశ్వాసపాత్రత వెనక గొప్ప ద్రోహం, గొప్ప శత్రుత్వం వెనక (ఒకనాటి) గొప్ప మైత్రి, గొప్ప మేధావిత్వం వెనక గొప్ప అమాయకత్వం, గొప్ప ప్రజాబలం వెనక గొప్ప ఒంటరితనం... ఇలా ఎన్నో సాక్షాత్కరిస్తాయి.

మొత్తమ్మీద సౌష్ఠవవాదాన్ని నేను తప్పుపట్టడం లేదు. మన సౌష్ఠవవాదం మనల్ని మనం మెఱుగుపఱచుకోవడానికీ, మఱింత తెలుసుకోవడానికీ, మఱింత బాగా పనిచేయడానికీ మాత్రమే. అంతేగానీ మన ప్రమాణాలతో ఇతరుల్ని అంచనావేసి, వారి మీద తీర్పులు తీర్చి, హీనపఱిచి వారి మనసునీ, మన మనసునీ ఏకకాలంలో పాడుచేసుకోవడానిక్కాదు. వ్యవస్థలకి సౌష్ఠవవాదం ఒక ఆవశ్యక దోషం (necessary evil). కానీ వ్యక్తిగత జీవితాలకి సంబంధించి నేను చెప్పేదేమంటే - మనుషుల నుంచి ఎక్కువ ఆశించొద్దు. ఆశించి భంగపడొద్దు. వారికి ఆదరాబాదరా యథేచ్ఛగా ముద్రాంకనం (branding) చేసిపారేయొద్దు. వారు చైతన్యమూర్తులు. బండఱాళ్ళు కారు. వారికి చిత్తచాంచల్యాలుంటాయి. వాలకాలు (moods) ఉంటాయి. వారిని క్షమించండి. వారి బలహీనతల్ని క్షమించండి. ఉన్నవారిని ఉన్నపళంగా అంగీకరించండి. మీ సంబంధీకులు ఎంత పెద్ద తప్పిదాలు చేసినా సరే, వారి పట్ల సంయమనం వహించండి. ఊరికే రక్తపోటు పెంచుకొని అలా విఱుచుకు పడిపోకండి. మీ స్పందనలో ఎంత న్యాయమైనా ఉండొచ్చు. ఎంత అమోఘ తర్కమైనా ఉండొచ్చు. కానీ ఇతరులు మానవసహజంగా పాల్పడే స్ఖాలిత్యాల ముందు అది నిష్ప్రయోజనం. కాబట్టి అతిసౌష్ఠవవాదంతో, లేదా అత్యాదర్శవాదంతో ఇతరుల్లో తప్పుల్ని మాత్రమే చూసే దోషైకదృక్కులుగా మిగిలి మీ అమూల్యమైన మానవసంబంధాల్ని చెడగొట్టుకోకండి. తమని క్షమించినవారే మనుషులకి మధురస్మృతులవుతారని గుర్తెఱగండి.   

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్