22.12.11

సంప్రదాయకవిత్వము-1



సమాసము మిక్కిలి యర్వాచీనము. ఏలన, నిఱువదవ శతాబ్దమునకు ముందున్నదెల్ల నొక్కవిధమైన కవిత్వమే. ఇఱువదవ శతాబ్దము నుండియు నిది కొలఁది సంకుచితార్థములను సంతరించుకొన్నది. అవి యేమన - ౧. ప్రాఁతవ్యాకరణముల రీతిలోఁ గూర్పబడునది ౨. వ్యవహారభ్రష్టమైన పదజాలమును వాడుక సేయునది ౩.  ఛందస్సులలో రచింపఁబడునది. ౪. పురాతనాలంకారశాస్త్రముల ప్రమాణముల ననుసరించునది ౫. పురాణైతిహాసికేతివృత్తములను వస్తువుగాఁ గైకొనునది అని. పక్షాంతరమున నీ యన్నియును గాక వీనిలో కనీసము రెండు-మూఁడులక్షణములనైన నేకకాలములోఁ గలిగియున్నచో నది సంప్రదాయకవిత్వమే యనుట పాఁడి.

ఆధునికులకు సంప్రదాయకవిత్వము నెడ నాభిముఖ్యమపరూపమనుటలో విప్రతిపత్తి లేదు. అందులకు నేఁటి విమర్శకులు కొన్నికారణముల నుపపాదింతురు. వానిలో మకుటాయమానమైన కారణము - సంప్రదాయకవిత కుపయోగించు భాష జనసామాన్యమునకు సులభావబోధ్యము కాదనునది. రెండవ యాక్షేపణ ఛందస్సును గూర్చి. ఛంద మభివ్యక్తివేగమునకడ్డుకట్ట యనియు, నుద్దిష్టపదములు పడవనియు, నొక పదమునకు మాఱొక పదమును వేయవలసిన నిర్బంధము పెచ్చనియు, వ్యర్థపదప్రయోగాపేక్షయు ననల్పమనియు వారి విశదీకరణ. తొల్తటి కారణము పఠితృజనక్లేశమును బురస్కరించుకొన్నది. మలికారణము ప్రణేతృజనసంకటమును లక్షించినది. ఈ ప్రకరణమున నావి మూఁడు విచికిత్సలు. సంప్రదాయకవిత్వము నిర్మాణక్లేశముల వలననో, యన్వయదుష్కరమగుట వలననో ప్రాచుర్యమును గోలుపోయినదా ? లేక పఠితృజన మిషమున రచయితలే తమ యుత్తరవాదిత్వమునకుఁ దిలోదకములిచ్చినారా ? అదియును కాదేనిఁ , గేవల లోకదుష్ప్రవాదములు లావై, సంప్రదాయకవిత్వ మనావశ్యకములైన కళంకములకు లోనుజేయఁబడి జనాదరణకుఁ గృత్రిమముగా దూరమైనదా ? చూడఁజూడఁగా నాకు కడపటిదాని భూమికయే బలవత్తరమని తోచెడి.

సంప్రదాయకవిత్వ మాధునిక కవిత్వము వలె నుపజ్ఞామాత్రసిద్ధము కాదనునది వాస్తవమే. కొంత హొంత తప్పదు. అనంతశబ్దబాహుళ్యపరిజ్ఞానము కావలె. వ్యాకరణము పొల్లుపోకుండఁ దెలియవలె. మఱియు వీనికి శిఖరాయమానముగా, ఛందస్సున భావాభివ్యక్తిని జిరకాలము గఱువవలె. పూర్వుల మార్గదర్శనమునకై తఱచుగాఁ బ్రాఁతకావ్యముల యనుశీలనము సహితమపేక్షితము. ఈ యావత్తు కార్యకలాపముచేత నష్టియేమి ? యని నా యంతర్మథనము. కవు లప్రాకృతులు. వారు తదితర సామాజికుల కంటెను విశిష్టులు. పదిమందికిఁ జెప్పఁదగు మట్టమునకుఁ జెందినవారు. పదిమందికంటె నెక్కుడు స్పందనలు గలవారు. ఆ పదిమందికంటె నెక్కుడు పరిజ్ఞానము గలవారు. తామాచార్యస్థానీయులై వారి పరిజ్ఞానము నితోఽధికముగా హెచ్చింపవలసినవారు.

అయినను గవిత్వమనునది కేవలము కడుపులోని కల్మషములను యథాతథముగాఁ దత్‌క్షణము క్రక్కివేయునట్టి మొఱటుప్రక్రియ కాదు. భావములకందమైన, శ్రవణసుభగమైన యాలోచనామృతమువంటి రూపునిచ్చు బాధ్యత కవులకుఁ గలదు. హృదయోద్వేజకములును, బరుషములు నై, వాఁడియమ్ముల పోలిక సూటియై తాఁకు భావములను సహితము సున్నితముగా, సుతారముగా, వ్యంగ్యోపదేశాత్మకముగాఁ దామరతూఁటితో మీఁటినట్లు జెప్పుటయే కవితాకళ. అందులకే దానిని గావ్యకన్యక యనినారు పెద్దలు. దానిని భరింపఁగల్గువాఁడే కృతిభర్త. అంతయేతప్ప నక్షర జ్ఞానమాత్ర సంపన్నుఁడైన ప్రతిపాఠకుఁడును గృతిభర్త కాఁడు, కాలేఁడు. అట్టి కృతిభర్తల కొఱకే కవులు కవనింప నొప్పును. మఱి యింత విశిష్టమైన కవనకళ నభ్యసింప విముఖులగునెడలఁ గవులకున్ను, తదితర సామాజికశేషమునకున్ను భేదమేమి ? అందుచేత నీ కళకు గౌరవార్హమైన శిష్టవ్యాకరణశైలియు, విశిష్టపదప్రయోగములున్ను మిక్కిలి యావశ్యకములైన తొడవులు.  ఇట్టి వ్యుత్పన్నతను బాధగానో, బంధనముగానో లెక్కించుటఁ జేసి కవుల మేధావైశాల్యమినుమడించునా ? వారి స్పందనలున్ను, మార్దవస్థాయియు నున్నతీభవించునా ? సాహితీసైరికులు సుంత వివేచింప నొప్పును. ఏలన, భావములు పదములను గలిగించినట్లే విపర్యాసక్రమమునఁ గొన్నిమారులు పదములు సహితము భావముల నుద్బుద్ధము సేయఁజాలును. ఇది యనుభవైకవేద్యము.

కనుక నీ రహస్యమును గుఱుతెఱిఁగి భావములను బ్రేమింపఁగల ప్రాజ్ఞులంతయే బిగితోఁ బదములను గూడఁ బ్రేమింపఁగలరు. వారు భావములను, భాషను వింగడింప నొల్లరు. ఏలన, నా లోఁతులేనివారికిది లేదు. ఈ లోఁతులేనివారికది లేదు. ఒక్కటే యర్థమిచ్చు పదముల మధ్య సహితమర్థచ్ఛాయల రీత్యా, గౌరవధ్వనిరీత్యా తేడలు కలవు. సుసంస్కృతుఁడైన కవికుమారుఁడు మనోహరమైన భావముల వ్యక్తీకరణ నిమిత్తమంతయే మనోహరత్వ ద్యోతకములైన పదములను మఱియు మార్గముల నప్రయత్నముగా వెదకికొనును. అందులకు దైనందిన లోకవ్యవహారశైలి కొన్నిమారు లుపయుక్తము కాదు. అంతమాత్రమునఁ గావ్యశైలిని గేవలము పదప్రదర్శనపటాటోపమని యూరక నిరసించుట తగదు. అక్కడక్కడ పటాటోప పరాయణులున్నమాట వాస్తవము. అట్టీండ్రు వ్యావహారిక రచయితల నడుమఁ గూడఁ గలరు, కాకపోయిన వారి పటాటోపము మఱియొక విషయములో ! అన్ని సంప్రదాయరచనలును బదాడంబరమున కుద్దేశించినవి కావు. సంప్రదాయరచనాకళ కొక స్వాభావికమగు రాజసము, వ్యావహారికవాదులెఱుఁగనిది, గలదు. ఆ శైలిలో నెవ్వఱు వ్రాయఁబూనినను, ఆ రాజసము తనయంత వచ్చి యావహించును. అందులకు సంప్రదాయకవులేమి చేయఁగలరు ?

కవిత జనసామాన్యమునకు సుబోధము గావలెనను వాదమునకు వెనుకఁ బ్రధానముగా మార్క్సిస్టు దృక్పథమున్నది. అర్థముకాని రచనలు సామాజిక పరివర్తన కుపయుక్తములు కాఁజాలవని మార్క్సిస్టుల యభిప్రాయము. కవిత్వమును వైయక్తిక రసానందము కొఱకుఁ గాక ప్రచారముల కొఱముట్టుగా వినియోగింపవలెనని యీ దృక్పథ మంతర్లీనముగా నుద్దేశించును. కవులతో సహా సమాజములోఁ బ్రతియొక్కఱి నార్థికజీవిగానో, రాజకీయజీవిగానో యీ దృక్పథము పరికింపఁగోరును. ఈ కోణమునుండియే యది సాహిత్యవిశ్లేషణలు కూడ జఱుపును. మనుజుల వ్యక్తిత్వమునందలి తదితర స్వతంత్రాంశముల నది యూఁచమట్టుగా నొప్పరికించును. ఇత్యాదికారణముల చేతను, మఱియుఁ బద్యకవుల మతాభిమానము చేతను యావత్తు సంప్రదాయకవిత్వమును జనవిరోధ సారస్వతముగా నది ముద్రవేయును. సంప్రదాయాభిమానమును నేఱమి (crime) గాఁ బరిగణించుట భావ్యము కాదు. అందఱమును బూర్వులవలెనె నోటి గుండా ఆహారముఁ దీసికొనుచున్నాము. వారివలెనె రాత్రిపూఁట నిదురించుచున్నాము. వారివలెనె బిడ్డలను గనుచున్నాము. వారివలెనె చనిపోవుచున్నాము. క్రొత్తగా వింతగా నేమియుఁ జేయుటలేదు. ఇవియెల్ల నేఱమి యగునేని సంప్రదాయరచనలు సేయుట కూడ నేఱమియే.

పక్షాంతరమునఁ, గవిత్వములో సుబోధతాలక్షణముండవలెనని యంగీకరించుచునే పైవాదమును బూర్వపక్షము సేయవచ్చును. కవిత్వము, నాఁడు గానిండు, నేఁడు గానిండు, ఆబాలగోపాలమునకును ఉద్దిష్టము కాదు. అట్టిచోఁ గేవలసంప్రదాయకవిత్వమే ప్రజలకు దూరమని వాక్రుచ్చుట సమంజసము కాదు. అర్థమగుటలో నవస్థాపరంపర కలదు. సామాన్య అక్షరాభిజ్ఞుని కంటెను బదియవ తరగతి జదివినవాని శబ్దపరిజ్ఞానమధికము. వానికంటె నొక విశ్వవిద్యాలయపట్టభద్రుని పరిజ్ఞానము మఱింత మెండు. కనుక సుబోధత యనునది రచనను బట్టి కాక చదువరులను బట్టి యుండును. చదువరుల వ్యుత్పన్నతాలోపములకుఁ గవులను నిందించుట యసమీచీనము. వ్రాఁదెనుఁగు చూచినవెంటనే యాకళింపు కావలెనను ఘోషించు వ్యావహారికవాదులు ప్రౌఢమైన యాంగ్లశైలిని మట్టుకిసుమంతైన యాక్షేపింపక తామును అదే పుంతఁ ద్రొక్కఁ గుతూహలించుచున్నారని గమనించునది.   

(ఇంకా ఉంది)

దీని రెండో భాగం  మఱియు మూడో భాగం కూడా చదవండి.                           

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్