26.12.11
సంప్రదాయకవిత్వము-2
5:10 PM వీరిచే టపా చెయ్యబడింది తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంనామాంకం (Label) భాషాసారస్వతములు
విత్వమునకు గ్రాంథికభాష యవశ్యమని యిప్పుడెవ్వఱు ననరు. కాని యొకఁడో రెండో క్రొత్తమాటలు తారసిల్లినంతమాత్రమున నర్థముకాని రచనగా ముద్రవేసి యావలఁ బారవేయుట వివేకవంతము కాదు. తెలుఁగునఁ గ్రొత్తమాటలకు విసిగికొనువా రాంగ్లమున నట్టివి యెదురైనప్పుడు తమ యజ్ఞానతిమిరమునే నిందించుకొనుచుఁ దద్భాషాకోశములను దిరుగవేయుచున్నారు. మాతృభాషయైన తెలుఁగనఁగా నెకసక్కెము తక్క నిందులకొక కారణము లేదు. క్వాచిత్కములైన సాంప్రదాయిక పదప్రయోగముల వలన శబ్దసంపద నిలువఁబడుటయే కాక చదువరుల స్థాయియుఁ బెఱుగునని గ్రహించునది.
అంతయేకాక, నైఘంటికశబ్దములనునవి మనమనుకొనుచున్నంత నిరుపయోగములు కావు. వర్తమానాంగ్లవ్యవహారమునందలి పెక్కు పదములకు నిక్కమైన యాంధ్రసమానార్థకములు గలవు. వానిని మన యాంగ్లవిద్య సమయింపక పూర్వమవి యహోరాత్రములు జనసామాన్యపు నాలుకలపై జవసత్త్వములతో నర్తించివట్టివియే. అవియెల్ల నిప్పుడు నిఘంటుసంపుట కారావాస దండనక్లేశము ననుభవించుచు మారుమూల చీఁకటులలో మ్రగ్గుచున్నవి. మనమన్ననో యవి యున్నవనియు నెఱుఁగమైతిమి. ఒకవేళ యెఱింగినను వానిని గఱువనొల్లము. ఈ వైఖరి మూలమున ననువాదము లక్కఱపడినప్పు డింగ్లీషుమాటలకు సరిసాటియైన తెనుఁగులు సిక్కక తలక్రిందులగుచున్నారము. ఇంగ్లీషును దెలుఁగులో వ్రాసి 'యదియే దేశ్య'మని సరిపెట్టుకొనుచున్నారము. ఇది యావశ్యకము కాదు. ప్రాఁదెనుఁగులను బునరుద్ధరించుటలో దోషము లేదు. అట్లిప్పటికెన్నియో ప్రాఁదెనుంగులు పత్రికాభాషలోఁ బునరుద్ధరణమునకు విషయములైనవి. ఇంకను గొన్ని యగుట కభ్యంతరము లేదు.
ప్రకృత ప్రకరణమున కప్రస్తుతమే యయినను గొన్ని నైఘంటికశబ్దములు మన కాధునికయుగమున సహితము పనికివచ్చునని యీ క్రిందఁ దార్కాణించుచున్నాను.
ఏనాదము - సముద్రపుటొడ్డు (beach)
కొటారు - ధాన్యమును నిలువసేయు చోటు (warehouse)
తండేలు - ఓడపెత్తనగాఁడు (captain)
లావణము - ఉద్యోగుల పట్టిక (payroll register)
సలితము - ఉద్యోగము నుండి తొలగించుట (layoff)
ఇల్లడము - దాఁచుమని యిచ్చు సొమ్ము లేక వస్తువు (deposit)
ఎగవు - ఆకాశములోఁ బోవుట (flight)
కురువ - కొండమీఁది కాలిబాట
కుట్టిమము - ఱాలతోఁ బేర్చిన గచ్చు (నేల)
సాటాబేరము - ఒక వస్తువునకొక వస్తువును మార్పిడి చేసికొను వ్యాపారపద్ధతి (barter trade)
జీవశాస్త్రము, రసాయనశాస్త్రము మున్నగునవి యెల్లఱకు నందుబాటులో నుండవలెనని కోరువారు లేరు. కవిత్వము మట్టు కాబాలగోపాలమునకును దత్‌క్షణాస్వాద్యము కావలెనని కోరువారీ కాలమునఁ బెచ్చఱిల్లిరి. తక్కుంగల విద్యలెట్లు విస్తరించినవో కవిత్వవిద్యయు నట్లే విస్తరించినది. వానిని సరళీకరించుటెట్లు దుర్ఘటమో దీనిని సరళీకరించుటయు నంతయే దుర్ఘటము. నిజమునకు ప్రజాసామాన్యపు మనోనిర్వృతికి నాఁడు గానీ, నేఁడు గానీ కవిత్వ ముపకరణము కాదు. వారికి నేఁడు సినీమాలు గలవు. దూరదర్శకములు గలవు. రేడియోలు గలవు.
సంప్రదాయకవిత్వము రాచఱికముల కనుయాయిగా, ధనస్వామ్యమునకు స్త్రోత్రపాఠముగాఁ బనిసేసినదన్న విమర్శయుఁ దఱచు వినంబడియెడి. ఇంతకుముందే చెప్పినట్లీ తెఱఁగు విమర్శలు మార్క్సిస్టుపక్షమునుండి ధ్వనించునట్టివి. వారి యభిమాన సిద్ధాంతము ననుసరించి నడచు దేశములలో నాధునిక కవిత్వము మార్క్సిజమునకు స్తోత్రపాఠముగా వినియోగపడుటలేదా ? కేవలము సంప్రదాయకవిత్వమునే యాడిపోసికొననేల ? మొదలు, కవిత్వమును బోషింపఁగల సంస్కారముండుటే యపరూపము. ప్రాఁతకాలములోని పాలకవర్గములన్నియుఁ గవిత్వమును బోషించినవన్నది యొక యపప్రథ. మహాకవి ధూర్జటి తన శ్రీ కాళహస్తీశ్వరశతకములో నేమనెనో చూడుఁడు :
మ|| క్షితినాథోత్తమ ! సత్కవీశ్వరుఁడు వ | చ్చెన్ మిమ్ములన్ జూడఁగా ;
నతఁడే మేటి కవిత్వవైఖరిని ; స | ద్యః కావ్యనిర్మాత ; తత్
ప్రతిభల్ మంచివి ; తిట్టుపద్యములఁ జె | ప్పం డాతఁ డన్నన్, "మమున్
గ్రితమే చూచెను పొ"మ్మటందు రధముల్ | శ్రీ కాళహస్తీశ్వరా !
ఛందస్సు నుద్దేశించిన యాధునికుల యభ్యంతరములు సైత మంగీకారయోగ్యములు కావు. దాని పరమార్థము నెఱుంగకే యీ యభ్యంతరావళి. రచనాప్రక్రియలో విధానము మఱియు విషయభరము (form and content) రెండును ముఖ్యమే యని తలఁచినప్పు డెంత నిస్సారవిషయమునైనను ఛందస్సు లయాన్వితముగా ధ్వనింపించునని గ్రహించునది. ఛందోనిర్బంధవశవర్తులై మన పూర్వకవులు వ్యవహారస్థ శబ్దజాలమునకు మారు ప్రాచీనపదములను బ్రయోగింపవలసె. కనీస మావిధముగానైన నా పదములు నష్టములు కాక యక్షరబద్ధములై మనగలిగి మనవఱకు వచ్చినవి. ఈనాటి వ్యవహారభాషాభినివేశమిట్లే కొనసాగినచో ననేకాంధ్రశబ్దములు భావిపురుషాంతరముల కప్రాప్యములై, యనూహ్యములై నశించిపోఁగలవు. అంతమాత్రమే కాదు, ఒక వచనభాగమునకంటె నొక పద్యభాగమును మననము జేసికొని యథాతథముగా నుట్టంకించుట సుకరము. "యోగశ్చిత్తవృత్తినిరోధః" అను పతంజలిసూత్రము సుప్రసిద్ధమే కదా ! చిత్తచాంచల్యమును నిరోధించుకొనుటయే యోగమని యా సూత్రభావము. కళలిట్టి చిత్తైకాగ్రతకు లెస్సయైన సాధనములు. కనుక నవియు యోగప్రాయములే. అందునా ఛందస్సునకున్న సంగీతలక్షణము వలన చదువరి మనస్సు నానాముఖీనమై పరుగులెత్తుట మాని పద్యము వెంటను, దద్గత ప్రయోగముల వెంటను దగిలి నడచును. అందుచేత నంతరంగమున కింతింతనరాని నిర్వృతి కలిగి చిత్తసంస్కారమినుమడించును.
(ఇంకా ఉంది)
దీని మొదటి భాగం మఱియు మూడో భాగం కూడా చదవండి.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)




4 వ్యాఖ్యలు:
చాలా బాగుంది సార్
సుబ్రహ్మణ్యంగారూ,
మీ వ్యాసం బాగుంది. అయితే, మీరు వ్యాసాన్ని వ్యావహారికంలో వ్రాస్తే మరికొంతమంది మనస్సులకు బాగా చేరి ఉండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యంగా మీరుద్దేశించిన పాఠకులకు మీ గ్రాంధికం కొరుకుడుపడక పోవచ్చును. నేను కూడా కొంత సంప్రదాయకవిత్వ వ్యవసాయం చేస్తున్నాను. బహుశః మీకు నచ్చ వచ్చును. వీలైతే నా నవకవనవనం బ్లాగు చూడండి. http://syamalatadigadapa.blogspot.com/
ఆర్యా ! నా వ్యాసం మీకు నచ్చినందులు నెనరులు. మీ బ్లాగు తప్పక చూస్తాను.
ఇది ఇప్పుడు వ్రాసిన వ్యాసం కాదు. వ్రాసి కొద్ది దశాబ్దాలయింది.
వ్యావహారికం నాకు స్వతహాగా అభిమత రచనాశైలి కాదు. వ్యావహారికంలో భావవ్యక్తీకరణస్వేచ్ఛ, వైవిధ్యమూ లేవు. నాకిష్టమైన పదాల్ని నేను అప్పటికప్పుడు కల్పించుకొని రచనలు చేయడం, ఒక విషయాన్ని రకరకాలుగా చెప్పడం నాకు సౌకర్యంగా ఉంటుంది. అది వ్యావహారికంలో సాధ్యం కాదు. దాని పరిధి చాలా పరిమితం. అదీగాక ప్రస్తావనని బట్టి శైలి మారాలని నా అభిప్రాయం. అంటే కొన్నికొన్ని ప్రస్తావనలకి వ్యావహారికమే తగినది. మఱికొన్నిప్రస్తావనలకి గ్రాంథికమే తగినది. ముఖ్యంగా వేదాంత, తాత్త్విక, ఆధ్యాత్మిక, సాహిత్య చర్చలకి వ్యావహారికం నప్పదు. అయినా ఇప్పుడు ఎక్కువ రచనల్ని వ్యావహారికంలోనే చేస్తున్నాను. అయితే ఎక్కువమందికి నా అభిప్రాయాలు చేఱడం విషయమై నాకాసక్తి లేదు. నేను అందఱివాణ్ణీ కాను. నా వ్రాతలు సమాజంలో కొద్దిమందికి మాత్రమే పరిమితమైతే అది నాకిష్టమే.
బాలసుబ్రహ్మణ్యంగారు,
మీ రుటంకించిన పదములు బాగున్నవి. తండేలు, తండెలు రెండు సమపదాలని నిఘంటువు ద్వారా తెలుసుకొన్నాను.
కొటారి పదము నేను మొదటిసారి విన్నది నాగయ్యగారి భక్తపోతన చిత్రములోని మా వదిన అనే పాటలో. నిటారిపోకడలా పసిడి కొటారి మా వదిన అని చరణంలో వస్తుంది.
చిత్రగీతాలు విని క్రొత్తపదాలు నేర్చుట మళ్ళీ ఎప్పుడో..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. మీకిష్టం లేకపోతే ఈ బ్లాగునీ, ఇందులోని టపాల్నీ చదవడం మానేయండి. అంతే గానీ ఇక్కడికొచ్చి అసభ్యదూషణలకి పాల్పడకండి ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా, కేవలం విషయాధారితంగా, సహేతుకంగా, ఆమోదయోగ్యమైన శైలిలో వ్యాఖ్యలు వ్రాయండి.