10.12.11

అలంకారముల పునస్సమీక్ష యావశ్యకము



వహారైక ప్రయోజనము గలిగిన లోకసామాన్యసంభాషణరీతివలె నీరసముగా ధ్వనింపక రసానందోద్దిష్టమగు శైలికి మెఱుగులు దిద్దుచు నందగింపఁజేయునవి యలంకారములు. ఇయ్యవి కేవలము కావ్యప్రపంచమూలకముగాఁ బొడమినవి కావు. భాష యనాదిగా నభివ్యక్తిసౌలభ్యము దెసఁ బయనించుచుఁ బ్రజానీకము నోట నానుచుఁ బోయిన దశాపరిణామక్రమములో నేర్పడి పాదుకొన్నవియే. పరిశీలింపఁగా, నొక భాషయందలి యలంకారములెల్ల మఱియొక భాషలో నుండునని నిర్ధారింప వలనుపడదు. కొన్నితెఱఁగుల పదవాక్యనిర్మాణము లాయా భాషలకే స్వత్వము. ఉదాహరణమునకు - "కర్పూరన్తీ దృశోర్మమ" అను వాక్యమున్నది. అనగా - "నా కండ్లకుఁ గప్పురమువలెఁ జల్లదనమును గలిగించు పడఁతి" అని యర్థము. కప్పురమువంటిదను నుపమానము మొత్తమును ’కర్పూరన్తీ’ అను నొక్కమాటతో వ్యక్తపఱుపఁజాలినదన్నమాట సంస్కృతవ్యాకరణ సామర్థ్యము. మన తెనుఁగున నిట్టి ప్రయోగమలవి కాదు. ఆ కోవలోనివే ’కాకతాళీయము’ మున్నగు శబ్దనిర్మాణములున్ను.

భరతుని నాట్యశాస్త్రములోఁ గేవలము నాలుఁగుగా నున్న యర్థాలంకారము లప్పయ్యదీక్షితుల నాటికి నూఁట యిఱవదినాలుగైనవి. స్థూలదృష్టితో - నలంకారమనంగా వర్ణనవిధానమనుకొన్నప్పుడు నూఁట యిఱువది వర్ణనవిధానములు యథార్థముగాఁ గలవా ? ఈ నూఁట యిఱువదినాలుఁగింటిలో నెన్ని మౌలికమైనవి ? మఱియెన్ని యితరాలంకారములకు ఛాయాప్రాయములైనవి ? యను విచికిత్సలు తలయెత్తును. మన పూర్వాలంకారశాస్త్రులు పేరుకొన్నవానిలో నెక్కువపాలు రూపకమునకును, ఉత్ప్రేక్షకును, శ్లేషకును ఛాయాప్రాయములే యని నుడువక తీఱదు. అంతియకాదు, వివిధాలంకారముల నిర్వచనములును, వాని యుదాహరణములును వెంట్రుకవాసి మాత్రమే పరస్పరము భేదించుచు నొక పెద్ద గందరగోళముగాఁ బరిణమించినవి. ఇందులకొక ప్రధాన హేతువేమనఁగా - నెవఱికి వారే యొక క్రొత్త యలంకారమును బ్రవేశపెట్ట నుత్సుకత గలవారై తత్పూర్వాలంకార సముదయమును సమగ్రముగాఁ బురశ్చరణము సేయమి. మఱియు నున్న మౌలికాలంకారముల పరిధినే నూత్నోదాహరణముల చేఱుపుతో నింకను గొంత విస్తరింపవలెనను ప్రేరణము కొఱవడుట.

అట్టులొకదాని కొకటి పోలియున్న కొన్ని యలంకారము లీ క్రింద సూచితములైనవి. పరికింపవలసినది.

౧. ఉపమా - స్మృతి
౨. ఉత్ప్రేక్ష - సందేహము
౩. రూపకము - ఉల్లేఖము
౪. అర్థాంతర న్యాసము - వికస్వరము
౫. విభావన - విషమము
౬. పరికరము - పరికరాంకురము
౭. శ్లేష - లలితము, రత్నావళి, వక్రోక్తి, నిరుక్తి
౮. భ్రాంతి - సామాన్యము
౯. సూక్ష్మము - పిహితము
౧౦. గూఢోక్తి - వివృతోక్తి
౧౧.అతిశయము - అత్యుక్తి
౧౨. ప్రతీపాలంకార ప్రభేదము - కావ్యార్థాపత్తి

ఇవి కాక, కావ్యరసాస్వాదనకళతో బొత్తుగా సంబంధము మాలి, పాషాణప్రాయమును, విరసమును అగు శుష్క తర్కశాస్త్ర పాండిత్యప్రకర్షతోఁ బూర్వవిద్వాంసులు కల్పించిన కృతకాలంకారము లనేకములు గలవు. ఉదాహరణమునకు - హేతువు, మిథ్యాధ్యవసితి, కావ్యలింగము, సమాధి, వికల్పము, సముచ్చయము, పర్యాయము, కారణమాల, వ్యాఘాతము, విశేషము, అధికము, అల్పము, విశేషోక్తి, విభావన, అసంభవము.

మొదలు అలంకారములవునో కాదో తేలిచి చెప్పుట దుర్ఘటమైనట్టివియుఁ గొన్ని కలవు. ఉదాహరణమునకు - భావికము, ప్రతిషేధము, మీలితము, పూర్వరూపము, తద్గుణము, ఉల్లాసము, విషాదనము, ప్రహర్షణము, వికస్వరము, ప్రత్యనీకము, పరివృత్తి, ఆక్షేపము ఇత్యాది. వీనియందెల్ల నెంతయో కొంత వక్రోక్తియు, నించుక చమత్కారమును గలుగలేదని కాదు. కాని యంతమాత్రమునఁ బ్రత్యేకాలంకారప్రతిపత్తి కర్హములని తోఁపదు. తఱచుగా నొకఁడో రెండో యుదాహరణములను గమనమునం దిడుకొని వానికి శాస్త్రనిరూఢిఁ గల్పించిన ట్లగపడుచున్నది.  ఉదాహరణమునకు - సహోక్తి, అనుజ్ఞ.

చోద్యమేమనఁ - గథాస్వభావముఁ గల ఘట్టములను స్వభావోక్తిగాఁ జెప్పిన పట్టుల సైతమా కథనవిధానమొక ప్రత్యేకాలంకారముగా గుఱుతింపు నొందుట. చతురఘట్టములు కవికల్పనదక్షత కెత్తిన పతాకలగుట నిక్కమయ్యు నంతమాత్రమున నవనవోన్మేషమై ఘట్టఘట్టమునకు భేదించు చమత్కార వైవిధ్యమును లక్ష్యముగా గ్రహించి యలంకార లక్షణములను వ్యాకరించు పక్షమునఁ గోటుల కొలఁదిగా నలంకారాభాసలు సిద్ధము గావచ్చును. అయినను, ఇట్టి బెడఁదకొడంబడి ఛేకాపహ్నుతి, ప్రహర్షణము, సూక్ష్మము, పిహితము, యుక్తి లోనగు పేళ్ళతో నపూర్వాలంకారములను మన పూర్వులు నిర్వచించి యున్నారు. ఈ తప్పిదము సంస్కరణీయము.

"ఎందఱెట్లన్నను, అలంకారముల సంఖ్య పెఱుగుచునే వచ్చినది, పెఱుగుచున్నది. నూతనములను గూడ గుర్తించి యావిష్కరించుట యవసరము" అని చంద్రాలోక సమున్మేష పీఠికలో శ్రీ టి.భాస్కరరావుగారు (స్ఫూర్తిశ్రీ, గుంటూరు) చేసిన నిర్మాణాత్మక సూచనము నొజ్జబంతిగాఁ గొని యలంకారశాస్త్రమును బునర్నిర్మించుట పాడి. అనఁగా - సాంప్రదాయికముగా వచ్చుచున్న యలంకారశాస్త్రములలోని యవ్యాప్తి, యతివ్యాప్తిదోషములను బరిహరించు యత్నమీనాటి యపేక్ష. యుగపత్తుగా, సంస్కృతవ్యాకరణపు మూసలోనుండి యలంకారములను విమోచించుటయు లెస్స. అది యెట్లంటేని, జీవంతములగు తెలుఁగు నుడికారములలోనను, జాతీయములలోనను, సామెతలలోనను, అట్లే తెలుఁగు వ్యాకరణ నిర్మాణములలోనను దాఁగియున్న నిజమైన యలంకారముల కొఱకు గాలించి సూత్రీకరింపవలయును. దీనిని బూర్వాచార పరాయణత్వముగా నెవ్వఱును బరిగణింపకుందురు గాక. గుంటూరు శేషేంద్రశర్మగారిని బోలిన యాధునిక కవులు సహితము "నేఁటికిని గవిత్వ మలంకారప్రధానమే" యని యుద్ఘాటించుట గమనార్హము.

అలంకారశాస్త్రమునకు మనవారి వరివస్య యిటీవలికాలమునందు మిగుల క్షీణించినది. దీనికి రెండు కారణము లుండనోపును. ప్రాఁతశాస్త్రములను గతానుగతికముగాఁ బఠనపాఠనములు సేయుట, లేదా పూర్వసంప్రదాయమును బూర్ణముగాఁ ద్రోసిరాజనుట. ఆంధ్రదేశ మనాదిగా నలంకారశాస్త్రుల కాలవాలమై సాఁగుచున్నది. పెదకోమటి వేమారెడ్డి సాహిత్యచింతామణిని వెలయించినదిక్కడే. సర్వజ్ఞ సింగభూపాలుఁడు రసార్ణవ సుధాకరమును సంతరించిన దిక్కడే. విశ్వేశ్వరుఁడు చమత్కారచంద్రికను రచించిన దిక్కడే. విద్యానాథుని ప్రతాపరుద్రయశోభూషణమును, బండితరాయల రసగంగాధరమును లోకప్రసిద్ధములే. ఈ జాపితా యొక యుద్గ్రంథమే కాఁగలదు. ఏతావతా మన యలంకారశాస్త్ర సంప్రదాయమును సృజనశీలముతో నిలుపవలసిన యగత్యము గలదని వక్కాణించుటయే నా యుద్దేశము.

పై ప్రతిపాదనమున కనుగుణముగా నీ వ్యాసరచయిత గుఱుతించిన కొన్ని క్రొత్త యలంకారముల నీ క్రింద లక్ష్యసమేతముగాఁ బ్రదర్శించడమైనది. పరికింపుఁడు :

౧. నినదాలంకారము : ధన్యనుకరణశబ్దముల మూలమున వర్ణనమునకు రసవత్త్వమును గూర్చుట. దీని నొక శబ్దాలంకార ప్రభేదముగాఁ జెప్పుకొనవచ్చును.

మ|| అకళంకస్థితి శీధుపానరుచులై యా సాదు లుప్పొంగి "యో
యకరో, యమ్మకరో యమక్కరొ యదీ ఇట్టిట్టకో" యంచుఁ బా
యక తప్పెట్లును దళ్ళెతాళములు నింపై సొంపు ఱంపిల్లఁగా
జకజుంజుం జకజుంజు జుమ్ముమనుచున్ సాఁగున్ గడున్ వాద్యముల్. 

(క్రీడాభిరామము పద్యము - ౧౪౭)

పై పద్యములోఁ గడపటి పాదమునఁ బ్రయోగించిన "జకజుంజుం జకజుంజు జు"మ్మను ధ్వన్యనుకరణమే నినదాలంకారము.

౨. క్రియాలంకారము : ఉపమానమున కన్వయింపఁదగు క్రియాధాతువు నుపమేయమున కన్వయించుట ద్వారమున నుపమానమును బరోఽక్షముగా సూచించుట. అనఁగా నుపమాన మిందులో వాచ్యముగాఁ బేరుకొనఁబడదని భావము. దీనికి లభ్యమగు నుదాహరణములలోఁ గొన్నింటిని రూపకాలంకారమునకును, మఱికొన్నింటిని లుప్తోపమకును బ్రభేదములుగా సహితము పరిగణించుట కవకాశము కలదు. లోకవ్యవహారము నుండి కొలఁది మచ్చుతునకలను గ్రహింపఁదగును.

(అ) వీరులు గర్జించినారు. (సింహముల వలె ; ఇక్కడ సింహము లనుక్తోపమానము)
(ఆ) దురదృష్టము కాటువేసినది. (పామువలె ; పాము అనుక్తోపమానము)
(ఇ) గుమాస్త లంచము మేసినాఁడు. (పశువు వలె ; పశువు అనుక్తోపమానము)
(ఈ) ఆయన యాంధ్రసాహిత్యము నేలినాఁడు. (రాజు వలె ; రాజు అనుక్తోపమానము)

౩. ప్రశ్నాలంకారము : కేవల ప్రశ్నములతోడనే వివక్షితార్థమును ధ్వనింపఁజేయుట.

శా|| కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ? గర్వోన్నతిం బొందరే ?
వారేరీ ? సిరి మూటఁ గట్టుకొని పోవన్‌జాలిరే ? భూమిపై
 పేరైనన్ గలదే ? శిబిప్రముఖులున్ బ్రీతిన్ యశస్కాములై
యీరే ? కోర్కుల వారలున్ మఱచిరే ? యిక్కాలమున్ భార్గవా ! 

(ఆంధ్రమహాభాగవతము - అష్టమస్కంధము)

౪. సమస్తోక్తి (సవాక్యాలంకారము) : ఒక్కవిధముగా నున్న వాక్యములతో నభివ్యక్తిసౌందర్యమును సాధించుట. ఇందులకు మన తెలుఁగు ప్రబంధములన్నింటఁ గోకొల్లలుగా లక్ష్యములు సిక్కును. 

తే.గీ|| కొన్నిదేశంబు లెండచేఁ గొవరువోయెఁ
గొన్నిదేశంబులివముచేఁ గొంకువోయెఁ
గొన్నిదేశంబులిరులచే గ్రుడ్డివడియెఁ
గొన్నిదేశంబు లివచేతఁ గుందువడియె. (కాశీఖండము 1 - ౧౩౭)

సీ|| అవలఁ బోయిన వెన్క నాడుటెన్నడు లేదు, మొగము ముందఱ నంట మొదలె లేదు
మనవిఁ జెప్పినఁ జేయకునికి యెన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలె లేదు.....

(విజయవిలాసము 1-౨౧) 

సీ|| తీర్థాల వెంబడి తిరుగుట గొన్నాళ్ళు, జన్నంపు దీక్షలఁ గొన్నినాళ్ళు
తుదలేని యొక్కపొద్దులచేతఁ గొన్నాళ్ళు, ఘోరతపంబులఁ గొన్నినాళ్ళు....

(శశాంకవిజయము 2- ౧౩౬)

ఉత్సాహవంతులిట్లే క్రొత్తక్రొత్త దేశి యలంకారములను వెలికిఁ దీసెదరు గావుతమని యాశంసించుచు విరమించుచున్నాఁడను.

(రచనాకాలం : 1990)

1 వ్యాఖ్యలు:

కొత్తపాళీ చెప్పారు...

చాలా బావుంది

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్