23.1.12
ధనసంపాదన మతలబులు-1
7:00 AM వీరిచే టపా చెయ్యబడింది తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంనామాంకం (Label) పిచ్చాపాటి
ర్వులకున్న మతపిచ్చి మనకు లేదనేది వాస్తవమే గానీ మనకున్న పిచ్చిధోరణులు మనకున్నాయి. వాటిల్లో ఒకటి డబ్బుపిచ్చి. చిత్రమేంటంటే - ఈ పిచ్చిని ఎవఱూ పిచ్చిగా చూడరు. పైపెచ్చు గొప్ప ప్రయోజకత్వంగా చూస్తారు. Monomania అని ఇంగ్లీషులో ఒక పదం ఉంది. ఎప్పుడూ ఒక్క విషయం గుఱించే ఆలోచిస్తూ ఉండే మానసికవ్యాధిని Monomania అంటారు. ఇప్పుడు జీవితంలోని తతిమ్మా అన్ని విషయాల్నీ వదిలిపెట్టి జనం చేస్తున్న కేవల ధనసంపాదన జపం కూడా ఒకరకమైన మనోవ్యాధే కనుక దీన్ని కూడా Monomania కిందికి తేవచ్చునేమో ఆలోచించాలి. ఏదైనా ఒక పనిచేయడానికి, ఒక లక్ష్యాన్ని సాధించడానికి కొంతమొత్తం కావాలి. ఇందుకు విరుద్ధంగా - ఏ పనీ చేయకుండా జీవితాన్ని ఆస్వాదించాలనే ధోరణిని సంతృప్తిపఱచుకోవడం కోసం మనుషులు డబ్బుని కోరుకుంటున్నారు. నిజానికి ఎక్కువ సందర్భాల్లో - జీవితంలో ఏ లక్ష్యమూ లేకుండానే అపరిమితమైన డబ్బుని వాంఛిస్తున్నారు. అంటే, డబ్బొస్తే తాము దాన్తో ఏం చేయబోతున్నారో తమకే తెలీని అయోమయంలో ఉంటూ డబ్బువెంట పడుతున్నారు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం కాకుండా డబ్బుని కేవలం డబ్బుకోసమే ఆరాధిస్తున్నారు. డబ్బు ఒక ఉపయోగకరమైన భౌతికవిలువ కావడం మానేసి ఒక మానసికమైన అమూర్తమైన ఆధ్యాత్మిక విలువగా మారింది.
"డబ్బు లేకపోతే బ్రతకలేం" అంటారు దేశాధ్యక్షుడి నుంచి దేశద్రిమ్మరి దాకా ! పాపం, వీళ్ళందఱినీ ఎవఱు తోస్తున్నారో డబ్బు సంపాదించమని ! వాడు సంపాదిస్తున్నాడని వీడు, వీడు సంపాదిస్తున్నాడని వాడు - ఇలా ఒకఱిని ఒకఱిని చూసి ఒకఱు పాడైపోవడం చూస్తూంటే డబ్బాశ మనోవ్యాధి మాత్రమే కాదు, అంటువ్యాధి కూడా అనిపిస్తుంది. మన సమాజంలో ప్రతి ఒక్కఱూ ఇతరుల్ని పీడించి బ్రతుకుతున్నారు కనుక ఆ పీడనుంచి రక్షణగా డబ్బు కావాలి. పరస్పర సామరస్యం, సహకారం, అవగాహన ఉన్న సమాజంలో చాలినంత డబ్బు లేకపోయినా గడుస్తుంది. కానీ మన కాలానికొచ్చేసరికి ఇది రాక్షసులు నివసించే సమాజమైపోయింది కనుక మనుషుల బదులు డబ్బుకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఎవఱికీ రక్షణలేని సమాజంలో డబ్బుకు మాత్రం రక్షణ ఎక్కణ్ణుంచి వస్తుంది ? దానికోసం ఖూనీలూ, కుతంత్రాలూ, దొంగతనాలూ, దోపిళ్ళూ సర్వసాధారణమైపోతాయి. "డబ్బు లేకపోతే బ్రతకలేం" అని ఆక్రోశించే బదులు అది లేకపోయినా ఆదరించే మానవీయ సమాజాన్ని సృష్టించరాదా ? ప్రతివాడూ లక్షాధికారి అవాలని కిందామీదా పడే బదులు అది చౌక గదా ? హృదయాల్ని కాస్త విశాలం చేసుకోరాదా ? డబ్బుకూ, గొప్పతనానికీ, సంస్కారానికీ, విజ్ఞానానికీ ముడిపెట్టడం మానేయరాదా ?
ధనవాంఛ కూడా మనకు పూర్వీకులందించిన వారసత్వమే. మనం డబ్బుచుట్టూ అల్లబడిన ప్రాచీన దుర్భావాల మమ్మీల్ని మోస్తున్నాం. డబ్బు చెడ్డది కాదు. కానీ మనం దాని ప్రాముఖ్యాన్ని అంచనా వేస్తున్న తీరూ, దాని సంపాదనాపద్ధతుల్ని వీక్షిస్తున్నతీరూ బహుచెడ్డవి. పరువూ, ప్రతిష్ఠ, పరపతి, బలం, కామం, విద్యాగర్వం ఇవన్నీ కూడా డబ్బులాంటివే. ఇవి కూడా మనిషిని చెడగొట్టేవే. అయితే డబ్బుంటే ఇవి చెల్లుతాయి గనుక నీతివాదుల దృష్టిలో డబ్బు కూడా చెడ్డదయింది.
నిజానికి మనిషిక్కావాల్సింది డబ్బు కాదు. నాలుగు చల్లని మాటలు మాత్రమే. అవి దొఱక్కపోవడం వల్లనే వాటిని డబ్బుపెట్టి కొనుక్కోవాల్సి రావడం. దగ్గఱ డబ్బుంటే ఆ చల్లని మాటలు మాట్లాడేవాళ్ళు నలుగుఱు చుట్టూ చేఱతారు. అంతిమంగా మనిషిక్కావాల్సింది అదే. "నువ్వు చెడ్డవాడివి" అంటే మనిషి ఎక్కువ బాధపడడు. కానీ "నువ్వు అసమర్థుడివి" అంటే అది అతనికి ఎక్కువ గుచ్చుకుంటుంది. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడమొక్కటే సమర్థతకి చిహ్నమై కూర్చుంది. నీ దగ్గఱ సమాజానికి అమ్ముకోవడానికేదైనా ఉండాలి. నిన్ను నువ్వు బాగా మార్కెట్ చేసుకోగలగాలి. నిన్ను కొనే శక్తి సమాజానికి లేకపోయినా అది నీ తప్పే. కొనబడేట్లుగా తయారవ్వాలి.
ఇదంతా ఎందుకొచ్చి పడుతోందంటే - మనం మానవసంబంధాల గాఢతని తక్కువ అంచనా వేయడం వల్లనే. వ్యాపారస్థుడి విలువలు మన మనస్తత్త్వాన్ని దురాక్రమిస్తున్నాయి. మనం వ్యాపారుల్ని అభినందిస్తూ వాళ్ళ వ్యాపారమతంలోకి మారుతున్నాం. పెట్టుబడి-లాభాల దృష్టితో మనం చదువులు చదువుతున్నాం. పరిచయాలేర్పఱచుకుంటున్నాం. అదే దృష్టితో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. పిల్లల్ని కంటున్నాం. అన్నింటికీ ముందే పథకం సిద్ధం చేసుకుంటున్నాం. మనం ఎవఱితో ఏం మాట్లాడినా ఆ డైలాగులన్నీ ముందే రిహార్సల్ చేసిపెట్టుకున్నవే అయ్యుంటాయి. ఈ విధంగా మనం యాదృచ్ఛిక అనుభవాలకీ, సంఘటనలకీ దూరమైపోతున్నాం. మన పథకాలకి వ్యతిరేకంగా ఏదైనా జఱిగితే ఓర్చుకోలేని మొండితనాన్నీ, జడ్డితనాన్నీ అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇదంతా మన వ్యాపారమతం నేర్పిన చెడుగే. ఫక్తు సామాజిక విలువ మఱియు విలువల రవాణాసాధనం అయిన ధనాన్ని మన వ్యక్తిగత కొలబద్దగా మార్చుకున్నాం. మన స్వంత కొలమానాలు కొన్ని ఉండాలనేది మర్చిపోతున్నాం. అలా చూసినప్పుడు మన కాలపు అసలు సమస్య selfishness కాదు, loss of the true self అనిపిస్తోంది.
జీవితమంతా వ్యాపారప్రాయమేనని వాదించే వ్యాపారవాదులున్నారు. వారిని Utilitarians అంటారు. వారి దృక్పథంలో - లాభం లేకుండా మనిషి ఏ పనీ చేయడు. మానవసంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడాల మీదనే ఆధారపడి ఉన్నాయి. తనని పెంచి పోషించని తండ్రిని తండ్రిగా ఎవఱూ అంగీకరించరు. కానీ ఈ వాదం పైపైన మాత్రమే సాధువు. అసలు చిక్కు ఎక్కడంటే - మనం ఈ అంశాన్ని ఏ కోణంలోంచి చూడాలి ? అనే దగ్గఱ. మానవసంబంధాల్లో వ్యాపారం ఒక భాగమా ? లేక వ్యాపారంలో మానవసంబంధాలొక భాగమా ? మనమంతా సమాజరూపంలో కలిసుంటున్నాం కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు జఱుగుతున్నాయా ? లేక ఇచ్చిపుచ్చుకోవడాల వల్లనే మనమంతా కలిసుంటున్నామా ?
మనిషి నైసర్గికంగా సంఘజీవి. సంఘటితం కావడం అతని స్వభావంలోనే ఉంది. కాబట్టి ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు అదిరిపోయేటంత స్థాయిలో లేకపోయినంత మాత్రాన అతను మిగతా మానవులతో జట్టుకట్టకుండా ఉండడని నా అనుకోలు. విమానాల్ని కనిపెట్టేనాటికి ఎన్నిదేశాలకి ఎన్నిదేశాలతో ఆర్థికసంబంధాలున్నాయి ? అంత మహా అవసరం లేకపోయినా వాటిని కనిపెట్టారు. అవి ఉన్నాయి కాబట్టి వేఱే దేశాలతో సంబంధాలేర్పఱచుకున్నారు. ఆర్థిక, సైనిక, పర్యాటకాది ప్రయోజనాలు తరువాత్తరువాత క్రమంగా ఏర్పడ్డాయి. ఒకవేళ విమానాలు లేకపోతే ఉన్నవాళ్ళు ఉన్నట్లే కొనసాగి ఉండేవారు. పోయిందేముంది ? ఒక ప్రయోజనం కోసం కాదు విమానం. అది దాన్ని కనిపెట్టినవాడి ఆసక్తి, కుతూహలాల కోసం అంతే ! దరిమిలా అది అందఱికీ ఉపయోగపడడం ఒక అనుకోని అనూహ్య యాదృచ్ఛిక సంఘటన మాత్రమే. అలాగే మనం ఈ రోజు లాభదాయకమైన వ్యాపారాలుగానూ, వృత్తులుగానూ చూస్తున్న పౌరోహిత్యం, న్యాయవాదిత్వం మొదలైనవన్నీ ఒకప్పుడు చరిత్రలో స్థానికంగా పరస్పరం పరిచితులైన మనుషులు ఒకఱికొకఱు చేసుకున్న సహాయసహకారాలు మాత్రమే. భాషకి లిపిలాగా సహకారానికి డబ్బు స్మారకచిహ్నంగా ప్రాతినిధ్యం వహించడం చాలా ఆలస్యంగా మొదలయింది. అయితే లిపి లేకపోయినా భాషలు బ్రతికే ఉన్నట్లు డబ్బు లేకపోయినా మనుషుల మధ్య సహాయసహకారాలు నిలిచే ఉంటాయి. మనక్కావాల్సింది కూడా అదే.
గమనిస్తే - సాధారణంగా మనుషులు తమ అనుభవాలకి ఓవర్ రియాక్ట్ అవుతూంటారు. చిన్నప్పుడెప్పుడో తాము ఆర్థికంగా బాధలు పడ్డామనీ, డబ్బులేకపోవడం వల్ల తమనెవఱో అవమానించారనీ, ఫలానా కోర్కె ఏదో తీఱలేదనీ అనంతర జీవితంలో కసిగా డబ్బు సంపాదిస్తూంటారు. కానీ చిత్రంగా ఇదే సున్నితత్వాన్ని చూపాల్సిన చోట్ల చూపించలేకపోతారు. "తమ దగ్గఱ ఉండాల్సినదేదో లేదు" అనే ఈ లేమిభావన మనుషుల్ని ఎంతగా క్రుంగదీస్తుందంటే దీని చుట్టూ చాలా సిద్ధాంతాలూ, పార్టీలూ, ఉద్యమాలూ కూడా బయల్దేఱాయి. నాకు మాత్రం ఇది మన బాల్యభావనలకి కొనసాగింపులా కనిపిస్తుంది. మన సర్వసంపదలకీ మూలం - మనం తోటి మనుషులకి శాయశక్తులా సేవచేయడం. మన సేవలకి ప్రతిఫలంగా మన తోడిమానవులు ధన-వస్తు-శ్రమాది రూపాలలో మనకి సంపదల్ని సమకూర్చిపెడతారు - తమకి తెలియకుండానే ! అలా తనకి తెలియకుండానే మనిషి ధనికుడవుతాడు. ఆ రకంగా ఇది సమాజం సమకూర్చిపెట్టిన సంపద, అది గుర్తించి అనుమతించి కట్టబెట్టిన యాజమాన్యం.
సానుభూతితో పరికిస్తే ధనమదం వెనక సైతం ఓ తరహా పసితనం ఉంది. ఎలా ? అనడిగితే, అనూచానంగా తెలిసిన నమూనాపాత్రల్ని ధరించే కుతూహలం సహజంగానే మనిషిలో ఉంది. తల్లి,. తండ్రి, రాజు, మంత్రి, వీరుడు, పోలీసు, బండివాడు, వ్యాపారి - ఇలాంటివన్నీ పరంపరాగతంగా వస్తున్న మూసపాత్రలు (stereotypes). వీటిల్లో ప్రతిదానికీ కొన్ని ప్రత్యేకలక్షణాలున్నాయనే భావన అనాదిగా సమాజంలో వ్యాపించిపోయింది. అయితే ఆ పాత్రలు ధరించినాక ఆ లక్షణాల్ని తామూ పుణికిపుచ్చుకోవాలనే అసంకల్పిత ఆతురతే ఈ పసితనం. తనకు తారసిల్లిన ధనికులంతా గర్వపోతులూ, మదాంధులూ కాబట్టి తామూ ధనం సంపాదిస్తే అలా ఉండాలనీ, ఉండకపోతే తాము ధనికులైనట్లు కాదనీ అజ్ఞాతంగా, అంతర్గతంగా ప్రేరణ పొందడమే ఈ పసితనం. ధనికుడనే ఓ నమూనాపాత్రలో ఎలాగైనా ఇమడాలనీ, ఇఱకాలనీ, ఒదిగిపోవాలనీ తహతహలాడడం. వ్యక్తులతో పాటు సమాజం కూడా ఎలాంటి పసితనంలో ఉందంటే- ఎవఱైనా అలా నమూనాపాత్రల్లో ఇమడకుండా తన యథార్థస్వభావాన్ని నిలుపుకుంటే "అలా ఉంటాడేంటి సాదా సీదాగా ? అంత డబ్బు ఎందుకు సంపాదించినట్లు ?" అని చెవులు కొఱుక్కుంటారు, మూసపాత్రలు నశించిపోకుండా కాపాడడమే సామాజికోన్నతికి లక్ష్యమైనట్లు !
(ఇంకా ఉంది)
దీని రెండో భాగం కూడా చదవండి.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)




7 వ్యాఖ్యలు:
ఒకప్పుడు ఏ విధంగా నైతే అరబ్బులు అడ్డొచ్చినవాణ్ణల్లా నిర్దాక్షిణ్యంగా సంహరించి, విధ్వంసాలు చేసి, బెదిఱించి, ఇష్టం ఉన్నవాణ్ణీ, లేనివాణ్ణీ కూడా బలవంతంగా ఇస్లామ్ లోకి పరివర్తించి ఆ మతాన్ని వ్యాపింపజేశారో,////
గౌరవనీయులైన మీ బ్లాగ్ చదువుకుంటూ పోతుంటే ఈ ముక్క తగిలి ముందుకు పడ్డాను...అందరూ..ఎప్పుడోకప్పుడు..ఎలాగోలాగా ...కిన్చాపరచాలనే చూస్తారు కదా.!!...దేశం మారాలి అంటే ..ఏమి మారి చస్తుంది ???
ఆర్యా ! మీ భావం సరిగా అర్థం కాలేదు. అరబ్బుల చరిత్రలోని అంశాలని ఉదాహరించడానికీ, మన దేశం బాగుపడడానికీ ఏంటి సంబంధం ? నేను ఎవఱిని కించపఱిచాను ? నేనీ బ్లాగులో ఎవఱినైనా కించపఱుస్తూ ఎప్పుడూ ఏమీ వ్రాయలేదు.
మరీ అమాయకుల్లగా ప్రవర్తించడం సరి కాదు....మీరు అరబ్బుల చరిత్ర ముసుగులో ముస్లిమలను కించ పరిచారు...తెలియనట్లు నటించడం కుడా ఒక కళే.....తోటి ముస్లిముల్ని ...అరబ్బుల చరిత్ర ...పాకిస్తానీయుల ఉగ్రవాదం అంటూ కించపరుస్తూ....వీళ్ళకి దేశభక్తి లేదు అనడం... మేము వినడం.... పరిపాటి అయిపొయింది......ఎంత కలిసి మెలిసి ఉందామన్నా మీలాంటి వారి అవమానాలతో అది సాధ్యపడక కొంతమంది దారితప్పుతున్నారు...దానికి అందరిని బాధ్యులని చేస్తారు మళ్లీ మీలాంటి మేధావులు...అసలు అనుమనిన్చాలిసినది ఇలా ద్వేషాలు రగిల్చే వారిని..
ఇది నా కోప ప్రదర్శనే కాని -- ద్వేష ప్రదర్శన కాదు అని అర్ధం చేసుకోగలరు అని అనుకుంటున్నాను
I read this three times. I am not able to connect the above comments to this . Any how I may read again. Please post comments which can be understood by the general readers.
Dr.G.A
Dr.G.A.,
My comments are not related to above post i just found them when i was going through the blog..i found it's not right for a person like Tadepalli gaaru..to write like that..The belief of " ISLAM SPREAD BY SWORD" is wrong..that's it:):)
ఆర్యా ! మీరు ఎంతసేపూ మీ కోణంలోంచే ఆలోచిస్తున్నారు. మన దేశపు సమకాలీన ముస్లిముల మీద నాకు ఏ విధమైన తక్కువభావం గానీ, కోపం గానీ లేదు. నేను వారిని గౌరవిస్తాను. నేను వారి శ్రేయోభిలాషిని కూడా ! ఆ రకంగా నేను ఎప్పుడూ ఏదీ వ్రాయలేదు. ఇహపోతే అరబ్బుల చరిత్ర మాత్రం అలాంటిదే. దానికి నేను గానీ, మీరు గానీ ఏమీ చేయలేము. చరిత్రని మనం మార్చలేము. మీరు ఊరికే ఆవేశపడొద్దు.
Leave it...I m not gonna argue with you, If i hurted you any means...HONESTLY i m sory...
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. మీకిష్టం లేకపోతే ఈ బ్లాగునీ, ఇందులోని టపాల్నీ చదవడం మానేయండి. అంతే గానీ ఇక్కడికొచ్చి అసభ్యదూషణలకి పాల్పడకండి ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా, కేవలం విషయాధారితంగా, సహేతుకంగా, ఆమోదయోగ్యమైన శైలిలో వ్యాఖ్యలు వ్రాయండి.