10.1.12
ఉపాసనామూలం
7:30 AM వీరిచే టపా చెయ్యబడింది తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంనామాంకం (Label) మతం-సంస్కృతి-సంప్రదాయం-ఆధ్యాత్మికం
నవులెప్పుడూ ఒక ఆశతో జీవిస్తూంటారు. ప్రస్తుతం లేనిదాన్ని రాబోయే కాలంలో సాధించగలమనే ఆ ఆశ. ఉన్నదానికంటే మెఱుగైనదాన్ని సాధించాలనేదే ఆ ఆశ. దాన్నే ఆదర్శం అంటాం. అదే ఆశ మఱెవఱికో ఉండి, వారు దాన్ని సరైన పద్ధతుల్లో సాధించినట్లు తెలిస్తే, తమ ఆశకి వారి దృష్టాంతం తోడైతే అది ఆదర్శమవుతుంది.
మానవుడు తక్కిన విషయాల్లో ఎలాంటివాడైనా మంచిని ప్రేమించడం, చెడును ద్వేషించడం అతనిలో సహజమైన ప్రేరణలు. మోసగాడు సైతం ఇతరులు ధర్మాత్ములై ఉండాలని కోరతాడు. తన వాతావరణం మూలంగానూ, పరిస్థితుల మూలంగానూ అతను మంచిగా ప్రవర్తించలేకపోవచ్చు. కానీ అలా ప్రవర్తించేవారిని ప్రతిమానవుడూ మనస్సులోనైనా అభినందిస్తాడు. బలహీనత, అసమర్థత, అజ్ఞానం, ఈర్ష్య, పాముపగ, పాశవిక కామం, భయం, అసత్యం - వీటన్నింటినీ ప్రతిమానవుడూ కనీసం అప్పుడప్పుడైనా ఏవగించుకుంటాడు. ఈనాడే కాదు, పదివేలేళ్ళ క్రితం కూడా ఈ విధమైన సదసద్విచక్షణ తప్పకుండా ఉండే ఉంటుంది. ఎందుకంటే మనిషి కావాలనుకుంటే పశువులా ప్రవర్తించగలడు. కానీ ఎంత ప్రయత్నించినా అతనెన్నటికీ నిజమైన పశువు కాలేడు.
తాను బ్రతికే ఈ అల్పజీవితంలో తనని పరివేష్టించిన మనుషుల మధ్య తనలోని లోపాల్నీ, దుర్గుణాల్నీ అధిగమించడం దుష్కరమని అతనికి తెలుసు. కానీ దుష్కరమంటే అసంభవం కాదు. ఏదో ఒకనాడు ఎవఱో ఒకఱు వాటిని అధిగమించి ఉంటారనీ, తాను కూడా అధిగమించగలుగుతాననీ మానవుడి ఆశ. దీని వల్ల ఎవఱికీ హాని లేదు. ఈ ఆశ, ఆకాంక్ష మానవుడి చేత దేవుణ్ణి ఆవిష్కరింపజేసి ఉంటాయి. దేవుడి రూపంలో మానవుడు ఉపాసించేది ఎవఱిని ? తన ఆకాంక్షలనే. మఱి దేవుడంటే ఆకాంక్షలనాలా ? మనిషి తన దుర్బలత్వానికి పెట్టుకున్న పేరు అనాలా ? అంతకుమించి మఱేమీ కాదా ?
మానవుడికి అంతిమంగా కావాల్సింది సుఖమేనంటారు ఎపిక్యూరియన్లూ, హెడానిస్టులూ ! సుఖమంటే వస్తుసంచయానుభవం అని ఇక్కడ అర్థం. సుఖం కంటే మానవుడికి ఎక్కువగా కావాల్సింది శాంతి. అందుకే "శాంతము లేక సౌఖ్యము లేదు." అంటుందొక వేదాంతకీర్తన. అందులో చాలా నిజముంది. శాంతం వల్ల సౌఖ్యం తప్పకుండా లభిస్తుంది. కానీ ఇందుకు విపర్యాసక్రమంలో - సౌఖ్యం వల్ల శాంతం లభిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఆకలేసినప్పుడు భోంచేస్తే సుఖంగా అనిపిస్తుంది. అలిసిపోయినప్పుడు నిద్రపోతే సుఖంగా ఉంటుంది. కానీ దాన్ని సుఖమని పిలవడం సమంజసమేనా ? అవి చెయ్యకపోతే అసుఖం. ఏది చెయ్యకుండా జీవుడు ఉండలేడో అది సుఖమెలా అవుతుంది ? మఱి అటువంటప్పుడు వాటిని మించిన సుఖం, శుద్ధసౌఖ్యం ఎక్కడైనా ఉందా ? ఉంటే అది ఎలా ఉంటుంది ? ఈ ప్రశ్న మనిషిని అంతర్ముఖుణ్ణి (introvert) చేస్తుంది.
మానవజీవితపు సంక్లిష్టత ఏ ప్రత్యేకవ్యక్తీ సృష్టించినది కాదు. ఎన్నో వేలేళ్ళ నాగరికతా పరిణామక్రమంలో ప్రతివ్యక్తీ, తెలిసో, తెలీకో భాగం పంచుకుని వృద్ధిచేసినది మాత్రమే. ఇది ఒక అనివార్యమైన చెడుగు. అంటే ఇది లేకుండా మనం బ్రతకలేమని కాదు. మానవుడు ’మనీషి’ కాబట్టి నాగరికత ఏర్పడకా తప్పదు. పెంపొందకా తప్పదు. చివఱికి సంక్లిష్టంగా, అయోమయంగా తయారుకాకా తప్పదు. కానీ వ్యక్తిస్థాయిలో నాగరికత ఒంటరితనాన్ని ఉత్పాదిస్తుంది. అనాగరికావస్థ మనకాదర్శం కాదు. కానీ అలాంటి దశలో ఉన్నవారిలా గుంపులో బతుకుతూ గుంపుతో పాటు మరణించగల ఆదిమనరుడి మానసికస్థైర్యం ఈ మానవుడికి లేదు. నాగరికత మనిషిలో "తాను సమాజం కంటే వేఱు, తాను చాలా విశిష్టం, తనక్కావాల్సింది వేఱు" అనే వ్యర్థ అహంకారాన్నీ, స్వార్థాన్నీ పెంపొందిస్తుంది. ఈ అహంకారమే ఒంటరితనానికి మూలం. తనకు ఏ వ్యక్తిత్వమూ లేదనుకొని సమాజంలో అందఱివాడుగా కలిసిపోతే ఒంటరితనం ఉండదు. అయితే ఇక్కడొక వైరుద్ధ్యం ఉంది. ఈనాటి మానవుడు గుంపులో తిరుగుతూంటాడు. కానీ ఇతడు గుంపునకు వ్యతిరేకి. ఇతడొక నడుస్తున్న సమాధి. ఈ పరిస్థితి మనిషిని వేదాంతినైనా చేస్తుంది. తాగుబోతునైనా చేస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే తనకో అదృశ్యశక్తి తోడుందనే నమ్మకం కావాలి.
మానవుడు ద్వంద్వభావాల సమ్మేళనం. అతడు వికారంలో సౌందర్యాన్నీ, సౌందర్యంలో వికారాన్నీ చూడగలడు. తిరగడానికీ, తెలుసుకోవడానికీ అతడు ఒక విశాలప్రపంచాన్ని అభిలషిస్తాడు. కానీ తనదని చెప్పుకొని గర్వపడేందుకు ఒక సంకుచితస్థలాన్ని కూడా అతను అపేక్షిస్తాడు. తన స్థాయీ, హోదా, అనుభవవైశాల్యాల గుఱించి పొంగిపోతూనే మఱోపక్క తన బాల్యాన్ని తలుచుకుని అంతకంటే ఎక్కువ పరమానందభరితుడవుతాడు. సంఘజీవనం అనుభవాన్నిస్తుంది. ఏకాంతం దాన్ని చిత్రిక పట్టుతుంది. మనిషికి రెండూ కావాలి. వ్యక్తిత్వంలో బహిరంగమూ, ఆంతరంగికమూ రెండూ ఉంటాయి. బహిరంగజీవితంలోని అశాంతిని ఏకాంతం ద్వారానూ, ఏకాంతంలోని అపరిపూర్ణతని సంఘజీవితం ద్వారానూ పూరించుకోవడానికి మానవుడు ప్రయత్నిస్తాడు. ఇది విఫలప్రయత్నం కాదు. కానీ అగాధమైన అంతరవలోడన అనంతరం ఈ రెండూ తనలోనే ఉన్నాయనీ, బయట లేవనీ గ్రహించినప్పుడు అతని ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది.
మానవుడు ఆశాజీవి అని ఇందాక చెప్పుకున్నాం. అందువల్లనే తనలోని అశాంతిని తొలగించుకునే మార్గాలన్నింటినీ అన్వేషిస్తాడు. ఇందులో దైవోపాసన ముఖ్యమైనది. ఆధునిక మానవుడు గుంపునకు దూరం కావడం వల్లా, వ్యక్తిగత సమస్యలు ఆశలతో పాటు పెఱిగిపోవడం వల్లా దైవప్రార్థనల అవసరం హెచ్చింది. పొట్టకి ఆకలి ఉంటుంది. గొంతుకి దాహం ఉంటుంది. ఊపిరితిత్తులకి శ్వాస కావాలి. చర్మానికి గాలాడాలి. ఈ అవయవాలన్నింటికీ జీవాన్నిచ్చి, ఆజ్ఞలిచ్చి పనిచేయించే మనసుక్కూడా లోలోపల అంతర్లీనంగా ఒక అదృశ్య, అజ్ఞాత దాహం ఉంటుంది. అదే ఆధ్యాత్మిక దాహం. తన ఉనిక్కి కారణభూతమైన ఆ ఏకైకశక్తిని చూడాలనీ, తెలుసుకోవాలనే తపన. వాటన్నింటినీ తృప్తిపఱచి దీన్ని మాత్రం అనాథగా, అసంతుష్టంగా, అర్ధాంతరంగా అలా వదిలేస్తే... ?
మనిషి ప్రకృతికి తలవంచి విజ్ఞాని అవుతాడు. సంఘానికి తలవంచి వినయవంతుడవుతాడు. ఆ విజ్ఞానమూ, ఈ వినయమూ ఆ రెండింటికంటే గొప్పవాణ్ణి చేస్తాయతన్ని. కానీ తన గొప్పతనం తనతో పాటే నశించిపోతుందని గ్రహించినాక దాని మూలమైన ప్రకృతిని తెలుసుకోవడం కాదు, ఆరాధించడం మొదలవుతుంది. అలాగే సంఘాన్ని చూసి భయపడడం కాదు, సేవచేయడం మొదలవుతుంది. తనకి చాలినంత తెలుసుననే అహం ఒకమూలనా, తనకి తెలియంది అనంతంగా ఉందనే లీలాస్ఫురణ ఇంకో మూలనా మనిషిలో ఉంటాయి. తెలీని విజ్ఞానం, తెలిసిన విజ్ఞానాన్ని ఓడించి తనని నష్టపఱిచే అవకాశం ఉందనే జంకు సైతం అంతర్లీనంగా ఉంటుంది. భగవంతుడే ఆ తెలీని అనంతవిజ్ఞానమూర్తి అనీ, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే పరిమితజ్ఞానం వల్ల కలిగే అనర్థాల్ని నివారిస్తాడనీ మానవుడు నమ్ముతాడు.
తాను అల్పుడని మానవుడికి తెలుసు. తనకి తెలిసేదీ, తన అనుభవంలోకి వచ్చేదీ తన స్వభావాన్ని ఉన్నతించడమే కాక తన సంసర్గంతో నీచమవుతుందని కూడా అతనికి తెలుసు. అందుకే తనకర్థం కానిదీ, తాను తనివితీఱా అనుభవించలేనిదీ, తనకంటే గొప్పదీ అయినదేదో ఉండి ఉండాలని అతని ఊహ. అతిపరిచయం వల్ల విసుగెత్తించే లౌకిక వస్తువుల కతీతంగా దర్శనదుర్లభమై, నవనవోన్మేషమైనదేదో ఒకటి ఉండాలని అతని ఆకాంక్ష. పాతబడి చెడిపోవడానికీ, వికారం కావడానికీ అవకాశమున్న దృశ్యమాన జడప్రపంచం కంటే భిన్నమై, అనశ్వరంగా, నిత్యనూతనంగా, నిర్మలంగా ఒక చైతన్యం ఉండాలని అతని ఆశంస. అందుకే అనేక వైరుద్ధ్యభూయిష్ఠమైన యావద్విశ్వ స్వభావాన్నీ "దే-వు-డు" అని మూడుముక్కల్లో తేల్చిపారేశాడు మానవుడు. శాశ్వతి, పవిత్రత, శక్తి, జ్ఞానం, కరుణ, సౌందర్యం, ధైర్యం, వైశాల్యం - అన్నింటికీ ప్రతినిధి, మూర్తీభావం ’దేవుడు’. మొదట్లో ఈ పదానికి ఇంత అర్థవైపుల్యం లేకపోవచ్చు. కానీ నేడు ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి లోపించినా ఏ దేవుడూ ఆరాధ్యుడు కాడు ప్రజలకి. బహుశా ఈ మాట భాషలో అన్నిపదాల కంటే నిత్యనూతనం. కోట్లాదిమంది ఈ పదంలో తమ హృదయాకాంక్షల్ని దాచుకొని దాన్ని గొప్ప ప్రజాస్వామిక శబ్దంగా రూపొందించారు. భగవన్నామం అహంభావాలకి చెంపదెబ్బ. నిరాశావాదానికి గొడ్డలిపెట్టు. అందువల్లనే అది ప్రపంచంలో ప్రాచుర్యాన్ని వహించింది.
లోకంలో ప్రతివారూ ప్రతిమానవుడి నుండీ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. నిజానికి ఈ లోకంలో పుట్టడం, ఏదో ఒక పని చేసుకొని మనుగడ వెళ్ళదీయడం - ఇవేవీ మనిషి యొక్క వ్యక్తిగతబాధ్యత కింద జఱిగేవి కావు. ఒకడు పుట్టినాక అతడు తన ప్రమేయమేమీ లేకుండానే ఒకఱికి కొడుకవుతాడు. ఒకఱికి సోదరుడవుతాడు. ఇంకొకఱికి మేనల్లుడవుతాడు. ఎదిగినంత మాత్రాన గానీ, ఏవో చదువులు చదివినంతమాత్రాన గానీ ఎవడూ తన స్థితికి తానే బాధ్యుడు కాడు. కానీ బాధ్యుడివే నంటుంది సమాజం. ఇక్కడే మనిషి ఒంటరివాడవుతాడు. సమాజం వ్యక్తికి ఎన్నో పేర్లు పెడుతుంది. ఆ వ్యక్తి పుట్టకముందే ఆ పేర్లు భాషలో ఉన్నాయి. సమాజంలో చెలామణిలో ఉన్నాయి. ఆ పేర్లకి అనుగుణంగా ప్రవర్తించమంటుంది. ఇది భార్య కర్తవ్యమంటుంది. ఇది కొడుక్కి విధాయకమంటుంది. ఇది భటుడి లక్షణమంటుంది. ఇది ఉపాధ్యాయుడి ధర్మమంటుంది. ఇలా అందఱూ తననుంచి ఏవో విధ్యుక్తాల్ని ఆశిస్తూ ఒత్తిడి చేయడం వల్ల మనిషి ఆత్మరక్షణలో పడతాడు. స్వార్థపరుడవుతాడు. కొందఱు మాత్రం ఈ దుష్ప్రభావాన్నుంచి ఓసరిల్లి తమ మానవత్వాన్ని అనుభూతి చెందడం అవసరమని భావిస్తారు. సరిగ్గా ఇక్కడే సృష్టికర్త అనే భావం మానవులుగా సృష్టిలో మన యొక్క యథార్థమైన స్థానాన్నీ, కర్తవ్యాన్నీ జ్ఞాపకం చేస్తుంది. మన మధ్య లౌకికంగా ఎన్ని అంతరాలున్నా, ఎన్ని బిరుదాలు ధరించినా సృష్టికర్త విధించిన నియమాల సమక్షంలో అందఱమూ సమానమేననే సత్యాన్ని ఆకళించుకోగలుగుతాం.
(రచనాకాలం : 1989)
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)




1 వ్యాఖ్యలు:
చక్కగా చెప్పారండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. మీకిష్టం లేకపోతే ఈ బ్లాగునీ, ఇందులోని టపాల్నీ చదవడం మానేయండి. అంతే గానీ ఇక్కడికొచ్చి అసభ్యదూషణలకి పాల్పడకండి ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా, కేవలం విషయాధారితంగా, సహేతుకంగా, ఆమోదయోగ్యమైన శైలిలో వ్యాఖ్యలు వ్రాయండి.