రీరం నవరంధ్రాలతో కూడుకొని రక్తమాంసాస్థినిర్మితమై మాలిన్యదూషితమైనటువంటిదని వేదాంతశాస్త్రాలు చెబుతాయి. ఈ బోధ ఒక ఆలోచనాతలం (thinking plane) లో వాస్తవమే అయినా ఇది ఎంతమందిలో యథార్థమైన వైరాగ్యాన్ని కలిగించిందో, ఎంతమందికి మోక్షం ఇప్పించిందో తెలీదు. ఇది మానవజాతి పట్ల గౌరవాన్ని కలిగించే బోధ మాత్రం కాదని అప్పుడప్పుడు అనిపిస్తుంది. దీనికి సామాన్యమానవుల్లో వచ్చే ప్రతిస్పందన రెండువిధాలు. ఒకటి, అసలు వేదాంతశాస్త్రాలనే ఏవగించుకోవడం. రెండోది - మానవీయ ఆదర్శాల మీదనే నమ్మకం సన్నగిల్లి నైతిక జీవనం మీద శంకలు బయలుదేఱడం.
శరీరమూ, ఆత్మా, ఒకటి కాదనీ, కనుక శరీరదూషణ అనుచితం కాదనీ వేదాంతానుయాయిలైన గృహస్థపండితులు అనవచ్చు. కానీ ఈ వివరణతో ఇతరుల్ని ఒప్పించడం కష్టం. సామాన్యమానవుల్లో ఆత్మదర్శులు లేరు. వారందఱికీ తమ శరీరమే తమ అస్తిత్వం. దాన్ని అసహ్యించుకుంటూ వారు బ్రతకలేరు. నిజానికి యథార్థమైన ఆత్మదర్శులు కూడా శరీరాన్ని అసహ్యించుకోరు. వారు ’శరీరమే ఆత్మ’ అనే స్థాయినుంచి ’శరీరం కూడా ఆత్మే’ నన్న స్థాయికి ఎదిగినవారు. ఉన్నతమైన ఆదర్శాల వైపు మానవాళిని మళ్ళించడానికి ఈ బల్లకోత (postmortem) ఉపదేశాలు మార్గం కావని తోస్తుంది. మానవశరీరాన్ని దూషించేవారు దాని నిర్మాణంలో సృష్టికర్త చూపిన అద్భుతమైన ప్రతిభనీ, విజ్ఞానాన్నీ, కళాత్మకతనీ విస్మరిస్తున్నారు. తద్ద్వారా వారు ఆయన్నీ, ప్రకృతినీ అవమానిస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా ఒక విషయం. నిజానికి వేదాంతోపదేశాలు జనసామాన్యాన్ని లక్షించి చేయబడ్డవి కావు. అవి శమదమాది సంపత్తి గల, యోగ్యులైన సన్న్యాసిశిష్యులకి సద్గురుముఖతః అందించడానికి ఉద్దేశించబడ్డవి. రహస్యమైన ఈ వేదాంతపు ముక్కలు ఎలాగో ఒకలా గృహస్థ పండితుల చేతుల్లో పడడం, వారు శాస్త్రాధ్యయనంలో భాగంగా అంటించుకొన్న ఈ ముక్కల్ని సాధారణ జీవనయానంలో అడుగడుగడుగునా ఉటంకిస్తూ హిపోక్రైట్లుగా బ్రతకడం, వారి పరస్పర వాదప్రతివాదాల ద్వారా అవి అందఱికీ అంటుకోవడం, తద్ద్వారా అవి అందఱికీ ఉద్దేశించబడ్డాయనే భ్రమ కలగడం, దరిమిలా వాటి మీద విమర్శలు లేవడం - ఇదంతా మన ఖర్మ. వేదాంతమొక్కటే కాదు, అసలు హిందూమతంలో ఏదీ సార్వజనీనం (universal) గా ఉద్దేశించబడ్డది కాదు. రెండో మూడో విషయాలు మినహాయిస్తే మిగిలిన ప్రతీదీ ఆయా కాలాలకో, ప్రాంతాలకో, కులాలకో, శాఖలకో, వ్యక్తులకో, పరిస్థితులకో, మానసికావస్థలకో పరిమితం. ఈ సంగతి గ్రహించలేక, ఈ మతంలో పుట్టిపెఱగనివాళ్ళు, కేవలం తమ యొక్క పరిమిత భాషాజ్ఞాన సహాయంతో ఈ మతం గుఱించిన పుస్తకాల్ని గురూపదేశం లేకుండానే చదివి, సందర్భాల్ని అసందర్భంగా అర్థం చేసుకుంటూ, తమ వంతుగా మఱికొంత బుఱద జల్లుతూ మఱికొన్ని పుస్తకాలు వ్రాశారు. ముఖ్యంగా ఎక్కడో, ఏ మూలనో, ఎవఱి కోసమో చెప్పిన విషయాల్ని హిందువులందఱికీ అన్వయించి విమర్శించడం తఱచుగా కనిపిస్తుంది. హిందూమతం కూడా తమ మతాల మాదిరే మతస్థులందఱికీ విధించబడ్డ ఉమ్మడి అనుశాసనం (common code) అని భ్రమించడం బహుశా ఒక కారణం.
మనిషి కూడా ఒకరకం జంతువే ననేవారున్నారు. మనిషిని మనమిప్పుడు అర్థం చేసుకుంటున్నవిధంగా కాక మఱో విధంగా ఎందుకు చూడాలో నాకు తెలీదు. జీవితపరమార్థాన్ని సాధించుకోవాలంటే దేవతలు సైతం మానవజన్మ నెత్తక తప్పదని పాతమతాలు చెబుతాయి. అతిశయోక్తిలా అనిపించినా అందులో అబద్ధం లేదేమో ననిపిస్తుంది, ఆలోచించినప్పుడు ! మనిషిని మనిషిగా గుర్తించి మానవత్వానికి విలువిచ్చిన సమాజాలూ, దేశాలూ నాగరికతలో ముందుంటున్నాయి. మనిషి అవసరాల్నీ, హక్కుల్నీ దృష్టిలో పెట్టుకున్న సమాజాలే ఈనాడు ప్రపంచంలో అందఱికీ ఆదర్శంగా నిలవగలుగుతున్నాయి. తద్విరుద్ధంగా, మనిషికి భద్రత లేనివీ, మనుషుల్ని గొఱ్ఱెలుగా జమకట్టేవీ, మనిషి అవసరాల పట్ల ఇసుమంత శ్రద్ధ కూడా చూపించలేనివీ అయిన దేశాలు వెనకబడ్డవిగానూ, బిచ్చగాళ్ళ గుంపులుగానూ చూడబడుతూ అంతర్జాతీయవేదికల మీద అవహేళనలకీ, అవమానాలకీ గుఱవుతున్నాయి. మనిషి అవసరాలేంటో సూక్ష్మంగా పరిశీలించి అందు కనుగుణంగా వస్తువులు తయారుచేసేవారు కోటీశ్వరులవుతున్నారు. అలాంటివారు ఎక్కువగా ఉన్నదేశాలు తక్కిన దేశాల్ని శాసిస్తున్నాయి. మనిషికి తిండి, బట్ట తప్ప ఇంకేమైనా అవసరాలుంటాయని కనీసం మాటమాత్రంగానైనా ఒప్పుకోనివీ, అక్కడే ఆగిపోదల్చుకున్నవీ అయిన దేశాలు ముష్టిముంతలు చేతబట్టి అడుక్కు తింటున్నాయి. మనుషుల్ని ప్రేమించడం చేతనైనవారు చరిత్రలో శాశ్వతస్థానం కొట్టేస్తున్నారు. అది చేతకానివారు అనామకులుగా ధూళిలో కలిసి క్షయించిపోతున్నారు.
మానవుడనే దైవం పట్ల మనం ఎంత భక్తిశ్రద్ధలు చూపించాలో ఈ నిదర్శనాలన్నీ స్పష్టంగా ప్రకాశమానం చేస్తున్నాయి. కానీ ఈనాటి ప్రజాస్వామ్య వాతావరణం మనిషిని మనిషిగా గౌరవించనివ్వదు. అంటే మఱో వ్యవస్థేదో గౌరవించనిస్తుందని కాదు. మనిషిని వ్యవస్థలన్నీ ఒక వర్గంవాడుగానో, ఒక సిద్ధాంతీయుడుగానో వీక్షిస్తాయి, ప్రైవేటు బస్సులవాళ్ళు ప్రయాణీకుల్ని టిక్కెట్లుగా చూసినట్లు ! అందుకే మనిషి వ్యవస్థల్ని ప్రేమించలేడు. తప్పనిసరై వాటిల్లో మిడుకుతూ ఉంటాడంతే ! తమని చాలినంతగా ప్రేమించడం లేదని ఆ వ్యవస్థలు అతనిపై నేఱారోపణ చేస్తూంటాయి. అతనికి అంకితభావం లేదంటాయి. అతనికి సమకాలీనస్పృహ పూజ్యమంటాయి. అతనికి బాధ్యతాభావం మృగ్యమంటాయి. అతన్ని మనిషిగా ప్రేమించి సేవించడం చేతకాక ఈ అష్టోత్తరశతనామాలు అతనికి అంటగట్టబడతాయి. ఈ తిట్ల దండకానికి అలవాటుపడి అతను కూడా అవన్నీ నిజమేననుకుంటూ ఉంటాడు. ఫలితార్థంగా, మనిషి అనే అమూల్య, సజీవ మహనీయమూర్తి బక్కపలచనై నిర్జీవ నిర్దాక్షిణ్య వ్యవస్థలు ఇంకా ఇంకా లావుగా, బండగా బలిసిపోతాయి. మనిషిని ప్రేమించి సేవించగల రోజున మనం అతన్నుంచి ఆశించే సుగుణాలన్నీ అతనిలో స్వచ్ఛందంగానే సాక్షాత్కరిస్తాయి.
మానవుణ్ణి ఆరాధించదల్చుకుంటే ’మానవజాతి’ గుఱించి ఆలోచించడం మానేయాలి. ఏ మానవుడికా మానవుడు విలక్షణమైన విశిష్టసృష్టి. ఎవఱికి వారే ఒక అద్భుతమూర్తి. ప్రతిమనిషీ ఒక సర్వస్వతంత్ర చైతన్యవ్యవస్థ. అతడు ప్రఖ్యాతపురుషుడయ్యేదాకా మనమీ విషయం ఒప్పుకోం. ఎవఱు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, అతడు ప్రఖ్యాతి చెందినా చెందకపోయినా ప్రతిమనిషీ ఒక విలువైన భాండాగారమే. ఎందుకంటే ప్రఖ్యాతి అనేది ఆత్మకి వాపే తప్ప బలుపు కాదు. అది ఆత్మకు సహజం కాదు. అనామకత్వమే సహజం. మనకి అభిమానపాత్రమైన వ్యవస్థలు సక్రమంగా సజావుగా నడవాలన్నా మనిషిని పూజించడం నేర్చుకోక తప్పదు. ఇవన్నీ మనిషి చుట్టూ వెలసిన వ్యవస్థలు. అతడు లేకుండా ఇవి లేవు. ముందు ఇవి అతని పట్ల భక్తిశ్రద్ధలు చూపిన రోజున, అతడు కూడా అందుకు ప్రతిగా వాటి పట్ల వాత్సల్యాన్ని ప్రసరించగలుగుతాడు. అలా కాక, అవి ప్రతిక్షణం పోలీసుకుక్కల్లా అతన్ని వాసనపడుతూ, వెంటపడి మొఱుగుతూ, ఱక్కుతూ పోతే ఆ సజీవదైవం ఏదో ఒకరోజున వాటికి కుక్కచావు వ్రాసి అమలుజఱుపుతాడు.
మానవుడి దుర్లక్షణాల వలె కనిపించేవాటి మూలాల్లోకి తొంగిచూడగలిగితే మనకి అతని పట్ల ప్రేమే కలుగుతుంది. ఏడు నిలువుల లోతున ఏనాడో పాతిపెట్టబడిన అతని శిశుహృదయం సాక్షాత్కరిస్తుంది. మానవులు వ్యక్తీకరించే అనేక వికారభావాలూ, వాటి వ్యక్తీకరణలూ తమ తమ మూలరూపాల్లో అందమైనవే. తన అంతస్సౌందర్యాన్ని వ్యక్తీకరించడం చేతకాక, అది చేతనయ్యేలా దారి చూపించేవాళ్ళు లేక, అందుకోసం ఓర్పుపట్టలేక మనిషి చెడ్డవాడుగా ముద్రపడతాడు. పద్ధతి తెలీకనే, అర్థం చేసుకోకనే అతను పాపాత్ముడవుతున్నాడు.
మన గుళ్ళల్లో దేవుడికి మేల్కొలుపులు పాడతారు. నైవేద్యాలు పెడతారు. పొగుడుతారు. ప్రార్థిస్తారు. మోకరిల్లుతారు. పట్టువస్త్రాలు కప్పుతారు. బంగారు ఆభరణాలు తొడుగుతారు. హారతి పేరుతో దిష్టితీస్తారు. ఆఖరికి అమ్మవారితో కూడా పడుకోబెట్టి పవ్వళింపుసేవ కూడా చేస్తారు. సేవిస్తున్నది భగవంతుణ్ణి. ఆయనకి ఇవన్నీ అవసరమా ? మఱెందుకు చేస్తున్నారు ? ఎందుకంటే, భగవంతుడి పేరుతో వాస్తవంగా మనం పూజిస్తున్నది మానవుణ్ణే. మానవుడి అవసరాల్నే దేవుడికి సైతం ఆపాదిస్తున్నాం. మానవుణ్ణి గౌరవించడానికీ, సేవించడానికీ ఏ పద్ధతు లవలంబిస్తామో అవి తప్ప వేఱే మార్గం లేదు దేవుణ్ణి సేవించడానిక్కూడా ! మానవ జనయిత్రీ, మానవరూపం తప్ప వేఱే దారి లేదు దేవుడు భూమండలం మీద అవతరించడానిక్కూడా ! ఇది భగవంతుడి దీనత్వం కాదు, మానవుడి మహనీయత్వం.
(రచనాకాలం : 1992)


1 వ్యాఖ్యలు:
Excellent
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. మీకిష్టం లేకపోతే ఈ బ్లాగునీ, ఇందులోని టపాల్నీ చదవడం మానేయండి. అంతే గానీ ఇక్కడికొచ్చి అసభ్యదూషణలకి పాల్పడకండి ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా, కేవలం విషయాధారితంగా, సహేతుకంగా, ఆమోదయోగ్యమైన శైలిలో వ్యాఖ్యలు వ్రాయండి.