3.1.12
ఉట్టంకనములు (Quotations)
7:34 PM వీరిచే టపా చెయ్యబడింది తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంనామాంకం (Label) భాషాసారస్వతములు
రస్వతాధ్యాయు లక్షరాస్యులగు టొక్కటియే చాలదు. అధ్యయించినదాని నొంటఁబట్టించుకొనఁజాలినవారునై యుండు టభిలషణీయము. వారు లిఖితమాధారముగా నలిఖితములను సహితము దొఱుకఁబుచ్చుకొనవలె. ఈ సామర్థ్య మలవడవలెనన్నఁ గొలఁది శిక్షణమావశ్యకము. సాహిత్యవిమర్శన గ్రంథానుసంధానమే యట్టి శిక్ష నలవఱుపఁగలదు. ఏ దృక్కోణముల నుండి యొక కృతిని బరికింపవలెనో కఱపుట విమర్శనగ్రంథములకే శక్యము. కనుక విమర్శకుఁ బ్రాధాన్యమేర్పడినది. ఇందుమూలమున సాహితీవిమర్శనము కేవల మాత్మాశ్రయముగా స్వాభిప్రాయప్రకటనము కొఱకే కాక సామాజికుల రసాస్వాదనశక్తిని మఱియుఁ బరిజ్ఞానమును బెంచుటకు సహిత ముద్దేశింపఁబడినదని తెలియుచున్నది. కావున విమర్శకుని బాధ్యత గురుతరము.
విమర్శకుఁడు పఠితకు జ్ఞానాభివృద్ధి సేయవలెనన్న నొక యంశమును గూర్చి తన స్వంత యభిప్రాయమునే కాక యితరుల యభిసంధిని గూడఁ బ్రదర్శించు టావశ్యకము. అందువలన విమర్శకుని వ్యుత్పన్నతయుఁ బఠితలకుఁ దెలియవచ్చును. ఒక విషయమును విమర్శకుఁడు సావకాశముగాఁ జర్చింపఁదలఁచినచో నడుమనడుమఁ దలయెత్తు నవాంతరప్రశ్నములకు సమాధానముల నన్వేషింపవలసియుండును. వానిలోఁ గొన్ని యిటీవలివై యుండవు. కనుక వానికిఁ బ్రాచీనుల ప్రత్యుత్తరములను దెలిపి కలరూపును దేల్పవలసిన పూచి విమర్శకునిదే. ఈ కార్యకలాపమునఁ బెక్కెడల నితరులనుండి యుట్టంకనములీవలసియుండును. తులనాత్మక పరిశీలనము కొఱకో, లేదా పఠితలతోఁ దన రసానందమును బంచుకొనుట కొఱకో కూడ గ్రంథభాగముల నుదాహరించుట కద్దు. నానాగ్రంథానుశీలనావకాశము చదువరులలోఁ బెక్కండ్ర కలభ్యము కాఁబట్టి యీ యుట్టంకనపద్ధతి కుపదేశప్రాముఖ్యమున్నది. మొదలు ఏ గ్రంథమును గానీ వ్యాఖ్యానింపని పట్టులందు సహితము విమర్శకుఁడు స్వాభిప్రాయముల కాకరములుగానో, యుపబలకములుగానో కొన్ని పంక్తుల నెక్కడినుండియో యుదాహరింపక తీఱదు. అభిప్రాయము లమూర్తములు. ఉదాహరణములు మూర్తములు. తొల్తటివి వైయక్తికములు. తరువాతివి లోకసిద్ధములు. ఇట్లగుటఁ జేసి విమర్శకుఁడు తన భావములను వినువీథి నుండి క్రిందకు దించి వానిచే భూమండలయాత్ర సేయింపవలెనన్న నుట్టంకనములు, నుదాహరణములు నను చక్రద్వయమును వానికమరించి వదలవలె.
ఈ కాలమునందిది కాసంత వ్యత్యస్తముగా నగపడుచున్నది. స్వాభిప్రాయములను సమాసము త్వరలో నిఘంటుసంపుటములకుఁ బరిమితము కావచ్చునని నే ననుమానించుచున్నాను. ఏలన, నీనాఁటి విమర్శకులు స్వాభిప్రాయములుండుట నొక దుర్లక్షణముగాఁ బరిగణించుచున్నారు. పరాభిప్రాయముల నదియే పనిగా నుటంకించుట తలపండినందులకొక నిదర్శనమై యలరారుచున్నది. ఏలకో స్వాభిప్రాయప్రకటన మప్రజాస్వామికమని ముద్రపడిపోయినది. స్వాభిప్రాయశూన్యులు గతానుగతిక పాఠప్రవచనములకేమో గానీ సాహితీవిమర్శనములకుఁ బనికివచ్చెదరా ? యని నా యంతర్మథనము. ప్రజాస్వామ్యములోఁ బదిమంది యభిప్రాయములు కావలె నన్నప్పుడా పదిమందిలో మనము లేమా ? మన కభిప్రాయములుండవా ? మనము వానిని నిష్కపటముగా వెలిబుచ్చఁగూడదా ? ఉట్టంకనముల పేరిట నెల్లప్రొద్దు లన్యభుజావలంబనమది యేల ?
ఈ లోపభూయిష్ఠ వాతావరణమెట్లున్నను దీని నడుమఁ దెలుఁగుభాష కంతయో యింతయో సేవజేయుచున్నది విశ్వవిద్యాలయ పరిశోధకులే. ఎక్కువశాతము పరిశోధనము లుద్యోగముల కొఱకును, దదున్నతి కొఱకును జఱుపునట్టివే యైనను దాము సేపట్టిన ప్రస్తావనకు న్యాయము సేయవలెననియే పెక్కండ్రు పాటువడుచున్నారు. పరిశోధనమునకై గతమును దఱచుట తప్పనిసరి. ఒక యంశమును గూలంకషముగాఁద్రవ్వి తీసి దేశమున కర్పించుటే వారికి విధాయకము. సందేశములిచ్చుట, క్రొత్తచైతన్యములకు నాందివలుకుట యిత్యాదులు వారి పనులు కావు. వారు స్వభావరీత్యా విమర్శకులు కారు. కనుక విడచిపుత్తము. కాని రచయితలును, విమర్శకులును బరిశోధకుల కంటె నెక్కువ బాధ్యత గలవారు. కనీసము వారట్లు చెప్పుకొందురు కదా !
ఎవఱిని గాని యుద్దేశింపక, తన యాంతర్యమూర్తి నెంతటికిని బ్రత్యక్షీకరింపక, పెద్దయుం బ్రొద్దు నలిగి నానిన పదావళిని బ్రయోగించుచు నేవియో నాలుఁగు కల్లబొల్లివాక్యములను గిలుకుటే యీనాఁడు సాహితీవిమర్శనముగా చెల్లుబాటగుచున్నది. ఏకదేశాత్మకముగాఁ గాక విశాలముగా విషయానుశీలనము జేయు వైఖరి నలవఱచుకొనుట విమర్శకుని కర్తవ్యము కాఁగా యాంత్రికోపోద్ఘాతములతో, నిర్మాంసమైన శైలితో నేఁటి విమర్శకుఁడు బుద్ధివైశారద్యమును, నిరంజనత్వమును అభినయించుచున్నాఁడు. విమర్శవిషయమైన రచయితను, లేదా కవిని యథాశక్తి యుగ్గడించివేయుటయే తఱచుగా దృశ్యమానమగుచున్నది. తదుపరి యా రచయిత కూడ విమర్శకుఁడైనప్పు డీయనను గొనియాడునని యూహింపనోపును. ఇట్లు కవి-విమర్శకులు పరస్పరస్తోత్రపరాయణులగు పట్టున వేఱుట్టంకనములతోఁ బనిలేదు. వారివారి లేఖనములే చాలును.
దీనికుద్దిగా నీనాఁడు సిద్ధమైన బెడఁద సర్వేసర్వత్ర యుట్టంకనబాహుళ్యము. నైజత (originality) కుఁ బ్రాధాన్యము సన్నగిల్లుట వలననే మన విమర్శకులలో నీ తత్త్వము ప్రబలినది. నైజత యున్న చోటఁ గ్రొత్తదనముండును. స్వేచ్ఛ యుండును. భావములలోఁ బదునుండును. ఎంతటి మందమతికైనను ఒక ప్రత్యేకకార్యక్షేత్రమునఁ గొంతకాలము పనిచేసెనేనిఁ గొన్ని స్వాభిప్రాయము లేర్పడకపోవు. వానినే సముచితరీతి నభివ్యంజించినప్పుడవియే యనంతరయుగమున నుదాహార్యములును, శిరోధార్యము లును గాఁగలవు.
కాని యుట్టంకనములనెడి గుదిబండలు మేధావుల నున్నపట్టున నుండి కదలనీయవు. భవిష్యద్వర్తమానముల కొఱకుఁ గ్రొత్తవిషయములను వాకొనువాఁడు గతమనెడి ’నూతిలోని గొంతుకల’ కొఱకేల చెవులు ఱిక్కించుట ? చెప్పునంశమునందు సత్యము గలదేని లాఁతివారల సమర్థనము నరువువేడఁ బనియేమి ? ఉట్టంకనముల కారణమున విమర్శనములెల్లఁ బరీక్షాసమాధానపత్త్రముల ననుకరించుచున్నవి. ఎవఱినో చూచి తామీ జాడ్యము నంటించుకొనుట మాత్రమే కాక యుట్టంకనవిరహితములైన విమర్శనములను జిన్నచూపు జూచుచు మన విమర్శకులు మఱికొందఱికి దాని నంటించుచున్నారు. ఇప్పుడే విమర్శనమును బరామర్శించినను "వేదకాలములో" అని మొదలగును. నిజమునకీ జాడ్యము తెలుఁగుదేశమునందే కాదు విశ్వజనీనముగా నున్నదేమో యనిపించెడి. లండనులో జ్ఞానయోగోపన్యాసములిచ్చినప్పుడు వివేకానందస్వాములవారన్నారఁట : "మోజెసునో, క్రీస్తునో, బుద్ధునో యుటంకించువారీ దినములలో హాస్యాస్పదులగుదురు. కాని హక్స్‌లీ, టిండాల్, డార్విన్ ఇత్యాదినామముల నుచ్చరించినంతమాత్రమున నింక నెల్లఱి నోళ్ళును మూఁతబడును." అని.
అట్లే మన తెలుఁగుమహాకవి ధూర్జటియుఁ దన సమకాల విద్వాంసులలోఁ బరివ్యాప్తమైన యుట్టంకనవ్యామోహమును నిరసించి యున్నాఁడు.
మ|| పటవద్, రజ్జుభుజంగవద్, రజత వి | భ్రాంతిస్ఫురత్ శుక్తివద్,
ఘటవత్, చంద్రశిలా జపా కుసుమ రుక్ | సాంగత్యవత్తంచు వాక్
పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవిం | పన్ లేక దుర్మేధసుల్
........................................................ శ్రీకాళహస్తీశ్వరా ! (శ్రీకా.హ.శ. 108)
నైజతాసంపన్నములైన కృతులు సృష్టి కాఁగా వానిపైని విమర్శనములు విశ్వామిత్రసృష్టివంటివి. మఱల నందులో నఱువుసొమ్మెందుకు ?
(రచనాకాలము : 15 మే 1991)
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)




3 వ్యాఖ్యలు:
బాగుంది తాడేపల్లి గారూ
కనుక పఠితల అభిప్రాయములని తెలుసుకోవడానికోసమూ, రచయితలు లేవనెత్తే విషయాలపై సమగ్రమైన చర్చ జరగడంకోసమున్నూ, మీ అభిప్రాయాలలోనూ, ద్రుక్కోణాలలోనూ రెండోకోణం పఠితలకు తెలియపరచుటకొరకూ.
మీ బ్లాగులో వ్యాఖ్యాసౌలభ్యాన్ని తొలగించవలదని విన్నపం :)
శ్రీకాళహస్తీశ్వర శతకం నా తెలుగుమీడియం చదువుల్లో ఎనిమిదో తరగతిలోనో ఏమో తెలుగువాచకంలో ఉండేది.
చాలా అద్భుతమైన సాహిత్యం, విలువైన పదప్రయోగం, ఒకదాన్ని మించి మరొకటి జీవితార్ధాలు .. మా నాన్నగారు కంఠస్థం చేయించేదాకా వదల్లేదు.
కాళహస్తీశ్వరశతకం అనగానే మొదట గుర్తొచ్చేది ఇదిగో ..
అంతామిధ్య తలంచిచూచినన్, నఱుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులునర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింతనిలపడు గదా శ్రీకాళహస్తీశ్వరా ..
ఇంతకుముందటి టపా మీద చర్చ అనవసరమని భావించి దానికి వ్యాఖ్యాసౌకర్యాన్ని ఎత్తివేయడం జఱిగింది. ఆ టపాని ఇప్పుడు తొలగించాను. తదుపరి టపాలకి వ్యాఖ్యలుంటాయి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.
రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. మీకిష్టం లేకపోతే ఈ బ్లాగునీ, ఇందులోని టపాల్నీ చదవడం మానేయండి. అంతే గానీ ఇక్కడికొచ్చి అసభ్యదూషణలకి పాల్పడకండి ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా, కేవలం విషయాధారితంగా, సహేతుకంగా, ఆమోదయోగ్యమైన శైలిలో వ్యాఖ్యలు వ్రాయండి.