1.2.12

ధనసంపాదన మతలబులు-2 (సమాప్తం)



తవిషయంలో మూఢవిశ్వాసాల్ని వదిలించుకున్నంత సులభం కాదు, డబ్బు విషయంలోనూ, ఇతర సామాజిక, మానసిక సంబంధాల్లోనూ నమూనాపాత్రల్లాంటి మూఢవిశ్వాసాల్ని వదిలించుకోవడం. వ్యవస్థ తమను వ్యక్తులుగా జడ్జ్ చేయాలని అందఱూ కోరతారు. కానీ తాము మాత్రం ఇతరుల్ని వ్యవస్థ కళ్ళతోనే పరికిస్తారు. ధనికుల్ని ఏదైనా నేఱారోపణ మీద చెఱసాలలో నిర్బంధించినప్పుడు తమకి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కావాలని వారు న్యాయస్థానానికి విన్నపం చేసుకుంటారు. తమ క్లయంటు ఒక విధమైన జీవనశైలికి అలవాటుపడ్డాడనీ, కనుక వేఱే సాధారణ బందీలతో పాటు ఉంచడం అవాంఛనీయమనీ వారి తరఫు న్యాయవాదులు వాదిస్తారు కూడా. అంటే వ్యవస్థ వారిని నేఱస్థులుగా చూస్తూండగా, వారు మాత్రం తమను వ్యక్తులుగా భావించి అలా మన్నించమని కోరుతున్నారన్నమాట.

మనకొచ్చిపడిన సంపద మనం మఱింత మానవోచితంగా, మఱింత సంస్కారవంతంగా వ్యవహరించడానికి విధివశాత్తూ చిక్కిన అవకాశం కావచ్చు. పరిశీలిస్తే డబ్బు గాలిలాంటిది. గాలి కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా, మఱికొన్నిప్రాంతాల్లో తక్కువగా వీచినట్లే డబ్బు కూడా కొంతమంది దగ్గఱ ఎక్కువగా, కొంతమంది దగ్గఱ తక్కువగా పోగుపడుతుంది. పోగుపడ్డందుకు ధనికుల బాధ్యతా లేదు. లేనందుకు పేదల లోపమూ లేదు. ఎంత కష్టించినా ధనసంపాదన అనేది పూర్తిగా మనిషి సంకల్పబలం మీద ఆధారపడ్డ విషయం కాదనిపిస్తోంది. ఒకవేళ సంపాదించినా, మన అధీనంలోని ధనానికి మనం నిర్వాహకులమో, కాపలావాళ్ళమో తప్ప పూర్తిగా అధినాథులం కాకపోవచ్చు. లక్షలాది రూపాయలు పోసి బంగళా కట్టుకున్నాక అందులో యజమాని ఒక్కడే కాపరం ఉండగలడా ? భార్యాపిల్లలూ, సేవకులూ, బంధువులూ, మిత్రులూ కూడా వచ్చి ఆ సొంతింటి సుఖాన్ని తనతో పాటు పంచుకుంటేనే కదా, అంత డబ్బు పోసినందుకు సార్థకత ? అంటే మనం సదరు ఇంటి నిర్వహణ నిమిత్తం యాజమాన్యపదాన్ని అలంకరిస్తున్నామే గానీ, ఎంత కష్టార్జితమైనా, మనదంటూ నిజంగా అక్కడ ఏమీ లేదు. ఉండదు. ఏ రూపంలో ఉన్న సంపద విషయంలో నైనా ఇదే పరిస్థితి. ఈ సత్యాన్ని అంతర్మథనంతో కనుగొన్నప్పుడు భార్యాబిడ్డల కోసమే కాక ఇతరుల కోసం కూడా నిర్మమంగా పాటుపడగలుగుతాం.

మంచిలక్ష్యాలూ, ఆదర్శాలూ లేని ధనార్జన ఒక జబ్బు. ఎందుకంటే ఆ తత్త్వం వాస్తవాల పపంచానికి విరుద్ధం కనుక. వాస్తవప్రపంచంలో బ్రతకడానికి మిలియన్లాదిగా, కోట్లాదిగా డబ్బు అవసరం లేదు. వాస్తవప్రపంచం మంచిదని మనం అనట్లేదు. కానీ అది మఱీ అంత చెడ్డది కూడా కాదు. భవిష్యత్తెలా ఉంటుందో మనం మునువల్కలేం. కానీ దాని గుఱించి అర్థం లేని భయాల్ని జీర్ణించుకోవడం మానసికారోగ్యమని మాత్రం ఒప్పుకోలేం. ఆదర్శాల్లేని ధనార్జన వెనక ఉన్న ప్రేరణ ఈ భవిష్యద్భయమే. మన ధనాన్ని తోడిమానవులతో పంచుకోను మనం తిరస్కరిస్తున్నంతకాలమూ మన ధనానికీ రక్షణలేదు, మన ప్రాణాలకీ రక్షణ లేదు.

జీవితపు తొలిసంధ్యలో దుర్భరమైన పేదఱికపు కడగండ్లు అనుభవించి తరువాత స్వయంకృషితో ధనికులైనవారు చాలామందే ఉన్నారు. ఇది అభినందనీయమైన సంగతే. కానీ పేదఱికమనే వేడివేడి ఇనపశలాక తమ మనస్తత్త్వం మీద వేసే నల్లని వాతలకి అటువంటివారు అతీతులు కాలేకపోతున్నారు. తాము పేదలుగా ఉన్నరోజుల్లో ఎవఱో తమని బాధించారని చెప్పి యావన్ మానవజాతిమీదా కసి పెంచుకుంటారు. ముఖ్యంగా తమకింద పనిచేసే ఉద్యోగుల మీద ఆ క్రౌర్యమంతా చూపిస్తూంటారు. ఒక నీతీ, నియమం లేకుండా ఎక్కడ డబ్బు కనపడితే అక్కడ అక్కడ ఆబగా అఱ్ఱులుచాస్తూ అహోరాత్రాలూ తపించిపోతూంటారు. వారి పేదఱికం ఓ గతించిన వాస్తవం. అది మళ్లీ వారి జీవితాల్లో అడుగుపెట్టే అవకాశం సాధారణంగా ఉండదు. కానీ వారు అలా అనుకోరు. పేదఱికమనే ఆ చచ్చిన పాముని జీవితాంతం కసిగా అలా కొడుతూనే ఉంటారు. చచ్చిపడున్న పులిని చూసి భయపడి చెట్టెక్కి కూర్చున్న వారు అది ఇహ లేవట్లేదని గమనించీ కూడా ఆ చెట్టుమీదే ఉండిపోతారు. అలా వారు తమ యొక్క ఇదివఱకటి పేదఱికంలోంచి ఒక బందిపోటు మనస్తత్త్వాన్ని అభివృద్ధి చేసుకుంటూ బ్రతుకుతారు. తాము ఖర్చుపెట్టగలిగిన ప్రతి రూపాయినీ వారు తమ పూర్వదారిద్ర్యపు దృష్టితో విలువకట్టి పొదుపు చేయబూనుకుంటారు. ఒకవేళ వారు అంతకు ముందు మధ్యతరగతి జీవితం గడిపినవారైతే ప్రతివిషయాన్నీ ఇంకా నెలజీతాల మీద ఆధారపడి బ్రతికే మధ్యతరగతి దృక్కోణం నుంచి చూడ్డానికి ఇష్టపడతారు. ఆ విధంగా వారి శరీరాలూ, పరిసరాలూ ధనికంగా మారినప్పటికీ వారి మనసులూ, ఆత్మలూ మాత్రం కటికబీదగా, నీచంగా, నికృష్టంగా ఎక్కడున్నవి అక్కడే మిగిలిపోతాయి. కష్టపడి పైకొచ్చినవాళ్ళని గౌరవించాలని ఇదివఱకు బళ్ళల్లో ఉపాధ్యాయులు చెబితే "ఆహా" అనుకున్నాం. కానీ పెఱిగి, పెద్దయ్యి ఈ తెఱగు మనస్తత్త్వాల్ని చూసినాక.... ?

(సమాప్తం)

దీని మొదటి భాగం కూడా చదవండి.

  (రచనాకాలం : 1995)       

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక :- ఇది సనాతన హిందూ సాంప్రదాయిక, ఆస్తిక, దేశభక్తియుత, తెలుగు సమైక్యవాద బ్లాగు.

రచయిత తన టపాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించి పొఱపాట్లు ఎత్తిచూపే హక్కు చదువరులందఱికీ ఉంది. కాని ఈ బ్లాగు యొక్క (పైన పేర్కొన్న) స్ఫూర్తికీ, లక్ష్యాలకూ విరుద్ధంగా మూలచ్ఛేదంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం అవి తక్షణమే తొలగించబడతాయి. అందుకు ఆ వ్యాఖ్యాతలే బాధ్యులు. ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించకుండా, కించపఱచకుండా వ్యాఖ్యలు వ్రాయండి.

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్